Telugu Global
Andhra Pradesh

నారా లోకేష్ పేరు.. అలా వాడేస్తున్నారు

తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లుగా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుందని ముందు నుంచీ ప్రచారం ఉంది. దీంతో పార్టీ ఇన్చార్జులతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు బాబుతోపాటు చినబాబునీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

నారా లోకేష్ పేరు.. అలా వాడేస్తున్నారు
X

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త లొల్లి ఆరంభమైంది. నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా ఒకరు ఉంటే, మరొకరు తనను నారా లోకేష్ పనిచేసుకోమన్నారంటూ రంగ ప్రవేశం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలలో చాలా మంది టిడిపి టికెట్ ఆశిస్తున్న వారు లోకేష్ పేరుని యథేచ్ఛగా వాడేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లుగా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుందని ముందు నుంచీ ప్రచారం ఉంది. దీంతో పార్టీ ఇన్చార్జులతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు బాబుతోపాటు చినబాబునీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఈ మధ్య కాలంలో అడిగిన వారందరికీ అపాయింట్మెంట్లు కూడా యువనేత ఇస్తున్నారు. వచ్చినవారు కలిసి పార్టీ పరిస్థితి బాగుందండి, నాకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాను అంటూ ఏవో కొన్ని పేపరు క్లిప్పింగులు, వీడియోలు ఆయనకి చూపిస్తారు. పనిచేయండి.. చూద్దాం అని లోకేష్ అంటున్నారు. ఈ చూద్దాం అనే మాట చినబాబు నుంచి రావడమే లేటు. లోకేష్ తో దిగిన ఫొటోలు లోకల్ మీడియాకి వదిలేసి, తనను పని చేసుకోమన్నారని, అంటే టికెట్ తనకేనంటూ ప్రెస్ నోట్స్ పంపేస్తారు. ఇలా నారా లోకేష్ పేరుని అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకూ చాలా మంది ఆశావహులు తెగ వాడేస్తున్నారు.

పాతపట్నం నియోజకవర్గంలో రియల్టర్ మామిడి గోవిందరావు, పలాసలో కమర్షియల్ ట్యాక్స్ మాజీ అధికారి జుత్తు తాతారావు, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు, రాజాంలో గ్రీష్మ, నెల్లిమర్లలో ఆనంద్ తమకే టిడిపి టికెట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. సత్తెనపల్లిలో అబ్బూరి మల్లి, సింగనమలలో ఎంఎస్ రాజు వంటి వారు అటు అనుబంధ సంఘాల బాధ్యతలు చూస్తూనే.. సీటుపై ఖర్చీఫ్ వేసి పెట్టి నారా లోకేష్ తమని పనిచేసుకోమన్నారంటూ కాక రేపుతున్నారు. పార్టీ కీలక విభాగాలు ఆయా ఆశావహుల పనితీరు మథించి, టెలిఫోన్ ద్వారా అభిప్రాయసేకరణ జరిపిన తరువాత టిడిపిలో సీట్ల కేటాయింపుపై అధినేత నిర్ణయం తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియలో చివరిదశ వరకూ ఎవరి అభ్యర్థిత్వం అయినా వస్తే, అప్పుడు పోటీలో ఇద్దరో ముగ్గురో ఉంటే.. లోకేష్ ఛాయిస్ తీసుకుంటారు. అటువంటిది అపాయింట్మెంట్ ద్వారా కలిసిన ప్రతీ ఒక్కరూ తమకే లోకేష్ ఆశీస్సులున్నాయని, టికెట్ కన్ఫ్మర్మ్ చేశారని డప్పు కొట్టుుకుంటూ ఉండడం పార్టీలో కలకలం రేపుతోంది. సిట్టింగ్ అభ్యర్థులు, ఓడిపోయిన వారు, ఆశావహుల మధ్య ఈ ప్రచారం తీవ్ర విభేదాలకి దారి తీస్తోంది.

First Published:  20 Dec 2022 12:52 PM GMT
Next Story