Telugu Global
Andhra Pradesh

జస్టిస్‌ దేవానంద్ బదిలీ దారుణం- కాంట్రాక్టర్లు

ఒక ఉద్యోగిని బదిలీ చేసినట్టుగా న్యాయమూర్తిని ఎలా బదిలీ చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ బదిలీ దారుణమని మాట్లాడారు.

జస్టిస్‌ దేవానంద్ బదిలీ దారుణం- కాంట్రాక్టర్లు
X

ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌ బదిలీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు వద్ద లాయర్లు ఆందోళనకు దిగారు. ఈ బదిలీలు అక్రమం అంటూ నినాదాలు చేశారు. బదిలీల్లో దక్షిణాది, ఉత్తరాది వివక్ష ఉందని ఆరోపించారు. బట్టు దేవానంద్‌కు మద్దతుగా కోర్టు వద్ద కొందరు కాంట్రాక్టర్లు మీడియా చానళ్లతో మాట్లాడారు. టీడీపీ హయాంలో తాము చేసిన పనులకు విజిలెన్స్ విచారణ పేరుతో ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని.. ఆ సమయంలో బట్టు దేవానంద్ దేవుడిగా వచ్చి తమకు బిల్లులు ఇచ్చేలా ఆదేశించారని కాంట్రాక్టర్లు మాట్లాడారు. ఇప్పటికి సగం డబ్బులు వచ్చాయని.. మిగిలిన డబ్బులు కూడా ఇప్పిస్తారనుకుంటున్న తరుణంలో దేవానంద్‌ను బదిలీ చేశారని కాంట్రాక్టర్లు ఆవేదన చెందారు.

ఒక ఉద్యోగిని బదిలీ చేసినట్టుగా న్యాయమూర్తిని ఎలా బదిలీ చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ బదిలీ దారుణమని మాట్లాడారు. టీడీపీ అనుకూల టీవీ చానళ్లే కాంట్రాక్టర్ల వద్ద మైక్‌ పెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవడం విశేషం. అటు మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌ కుమార్ నేరుగా జగన్‌పైనే విమర్శలు చేశారు. ఏపీలోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల నుంచి న్యాయమూర్తులపై ప్రస్తుత సీజేఐకి ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. నిజాయితీగా ఉండే జడ్జిలను బదిలీ చేయించడం ద్వారా తమ జోలికి వచ్చినా, అధికారులకు శిక్షలు వేసినా ఇలాంటి పరిణామాలే ఉంటాయని చెబుతున్నట్టుగా ఉందని ఆరోపించారు. జగన్‌మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారని శ్రవణ్‌ కుమార్‌ మండిపడ్డారు. అనేక మంది అధికారులు కోర్టు ముందు వచ్చి నిలబడుతున్నారంటూ అందుకు జస్టిస్ బట్టు దేవానందే కారణం అన్నది అందరికీ తెలుసని శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ వాదన నిజం అనుకుంటే సీజేఐ నేతృత్వంలోని కొలిజియం జగన్‌ ప్రభావానికి లొంగిపోయిందనుకోవాలా?. పలాన న్యాయమూర్తి ఉంటేనే తమకు బిల్లులు వచ్చేవి అని కాంట్రాక్టర్లు మాట్లాడటం బట్టి.. మిగిలిన న్యాయమూర్తులపై వారికి నమ్మకం లేదా?. ఆధారాలు, వాదనలతో సంబంధం లేకుండా ఇతర న్యాయమూర్తులు వ్యవహరిస్తారని కాంట్రాక్టర్లు భావిస్తున్నారా?.

First Published:  25 Nov 2022 10:50 AM GMT
Next Story