Telugu Global
Andhra Pradesh

వివేకా హత్యకేసు విచారణలో మరో కీలక పరిణామం..

లేఖపై మరోసారి దృష్టి సారించింది సీబీఐ. ఆ లేఖలో కంటికి కనిపించని వేలిముద్రలు ఏవైనా ఉన్నాయేమోననే కోణంలో విచారణ చేపట్టింది. నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి కోరింది.

వివేకా హత్యకేసు విచారణలో మరో కీలక పరిణామం..
X

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. హత్యా స్థలంలో దొరికిన లెటర్ విషయం ఇటీవల బాగా హైలెట్ అయింది. ఆ లేఖ గురించి ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రస్తావించారు. ఆ లేఖను ఇప్పుడు నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపాలని సీబీఐ భావిస్తోంది. దీనికోసం సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

ఆ లేఖలో ఏముంది..?

డ్రైవర్‌ ప్రసాద్‌ తన హత్యకు కారణమని, అతడిని వదిలి పెట్టొద్దంటూ చనిపోయే ముందు వివేకా రాసినట్టు చెబుతున్న ఓ లేఖను సీబీఐ గతంలోనే స్వాధీనం చేసుకుంది. ఆ లేఖలో ఉన్నది వివేకా చేతి రాతేనా లేదా ఆయనతో బలవంతంగా ఎవరైనా ఆ లేఖను రాయించారా అనే విషయాలను నిర్థారించుకుంది. వివేకాతో ఆ లేఖను బలవంతంగా రాయించినట్టు సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (CFSL) ఇది వరకే నిర్థారించింది. ఆ తర్వాత దర్యాప్తులో అప్రూవర్‌ గా మారిన షేక్‌ దస్తగిరి.. వివేకాతో లేఖను బలవంతంగా రాయించినట్లు సీబీఐకి వెల్లడించారు.

అక్కడితో లేఖ వ్యవహారం ముగిసిందని అనుకున్నా ఇటీవల అవినాష్ రెడ్డి.. ఆ లేఖను వివేకా కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగానే లేఖను దాచి పెట్టారని, దానిపై సీబీఐ సరిగా దృష్టిపెట్టలేదన్నారు. ఈ నేపథ్యంలో లేఖపై మరోసారి దృష్టిసారించింది సీబీఐ. ఆ లేఖలో కంటికి కనిపించని వేలిముద్రలు ఏవైనా ఉన్నాయేమోననే కోణంలో విచారణ చేపట్టింది. నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి కోరింది. గతంలో కూడా సీబీఐ నిన్ హైడ్రిన్ పరీక్షను కోరినా.. ఆ పరీక్ష చేస్తే చేతిరాత చెరిగిపోయే ప్రమాదముందని CFSL తెలిపింది. అయితే ఇప్పుడు ఆ లేఖను కలర్ జిరాక్స్ తీసి, దాన్ని భద్రపరిచి, ఒరిజినల్ కాపీకి నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది సీబీఐ. దీంతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అంటున్నారు అధికారులు.

First Published:  13 May 2023 5:10 AM GMT
Next Story