Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఘనతలు.. కేవీపీ ఘాటు విమర్శలు..

ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ ఏపీకి మరణ శాసనం రాసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు కేవీపీ. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేయడం కూడా చంద్రబాబుకే సాధ్యమైందని మండిపడ్డారు.

చంద్రబాబు ఘనతలు.. కేవీపీ ఘాటు విమర్శలు..
X

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత ఏపీలో రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2018లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని తాను వ్యతిరేకించానని, ఆ విషయం ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదన్నారాయన. టీడీపీతో పొత్తు నచ్చకున్నా.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అప్పట్లో నోరు మెదపలేదని వివరించారు.

బాబు ఘనతలు..

వైఎస్ఆర్ తవ్వించిన కాల్వల నుంచి నీరు పారించి.. మొత్తం తానే చేశానని చెప్పుకునే ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు కేవీపీ రామచంద్రరావు. సెల్ ఫోన్లు తెచ్చింది కూడా చంద్రబాబేనంటూ సెటైర్లు పేల్చారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏపీలో మురికి కాల్వల్లో అవినీతి గురించి మాట్లడడానికే చంద్రబాబు పరిమితం కాకూడదని, ఢిల్లీకి వచ్చి పోరాడాలని సూచించారు.

ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ ఏపీకి మరణ శాసనం రాసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు కేవీపీ. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేయడం కూడా చంద్రబాబుకే సాధ్యమైందని మండిపడ్డారు. 2016లో రాహుల్ గాంధీ మీద రాళ్లు వేయించిన చంద్రబాబు, 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని. ఎన్టీఆర్ కోసం 1984లో పోరాటం చేసిన బాబు, అదే ఎన్టీఆర్‌ ను పార్టీ నుంచి బయటకి పంపించేశారని.. చంద్రబాబు దేనికైనా సమర్థుడని ఎద్దేవా చేశారు.

మరోవైపు.. బీజేపీ-వైసీపీ సంబంధాలపై కూడా కేవీపీ ఘాటుగా స్పందించారు. బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించ లేకపోతుందో తనకు కారణం తెలియదన్నారాయన. వైఎస్ఆర్ మరణం తర్వాత తాను జగన్‌ కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పలేనన్నారు కేవీపీ. కానీ ఏదో ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెబుతానన్నారు.

First Published:  1 April 2023 8:42 AM GMT
Next Story