Telugu Global
Andhra Pradesh

కర్నూలు వైసీపీలో టికెట్ కోసం అప్పుడే మొదలైన లొల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నియోజకవర్గం చూసినా అధికార వైసీపీలో టికెట్ల కోసం పోటీ పడేవాళ్ల సంఖ్య పెరుగుతున్నది.

కర్నూలు వైసీపీలో టికెట్ కోసం అప్పుడే మొదలైన లొల్లి
X

ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నియోజకవర్గం చూసినా అధికార వైసీపీలో టికెట్ల కోసం పోటీ పడేవాళ్ల సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల పలు సర్వేల్లో 2024లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందనే రిపోర్టులు వచ్చాయి. దీంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా కాదని తమకు టికెట్ కేటాయించాలని కోరే వాళ్లు పెరుగుతుండటంతో పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా కర్నూలు‌ వైసీపీలో కూడా రాబోయే అసెంబ్లీ టికెట్ తనకు వస్తుందంటూ ముగ్గురు నేతలు చెప్పుకుంటూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా.. ఆ ముగ్గురు ఏ మాత్రం తగ్గడం లేదు.

2014లో కర్నూలు సెగ్మెంట్ నుంచి వైసీపీ తరపున ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. మొదటి నుంచి ప్రజల మనిషిగా పేరున్న మోహన్ రెడ్డి.. ఎస్వీ ట్రస్టు ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలు, నిరుద్యోగుల కోసం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ చంద్రబాబు కర్నూల్ టికెట్‌ను టీజీ వెంకటేశ్ కొడుకు టీడీ భరత్‌కు ఇచ్చారు. మరోవైపు ఎస్వీ మోహన్ రెడ్డి వెళ్లిపోవడంతో వైసీపీ హఫీజ్ ఖాన్‌కు టికెట్ ఇచ్చింది. టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఎస్వీ మోహన్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరి హఫీజ్ ఖాన్‌కు మద్దతు పలికారు. హఫీజ్ కోసం మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేసి గెలిపించారు.

అయితే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరుకు తెరలేచింది. కర్నూలు సీటు తనదేనని.. తాను చేసిన చిన్న పొరపాటు వల్ల టికెట్ హఫీజ్‌కు ఇచ్చారని మోహన్ రెడ్డి కార్యకర్తలకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలిసి హఫీజ్ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం కోసం ఆశపడి పార్టీ మారారని.. కర్నూలు ప్రజలు తననే గెలిపించారు.. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు వీరిద్దరి మధ్య కర్నూలు నగరంలోని కేబుల్ నెట్‌వర్క్ విషయంలో గొడవలు జరిగినట్లు తెలుస్తున్నది. దీంతో కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయారు.

వీరిద్దరి మధ్య టికెట్ కోసం గొడవ జరుగుతుండగానే.. బషీర్ అనే మరో యువ నేత వారిద్దరికి కాకుండా టికెట్ తనకు వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. కర్నూలు టికెట్ తనకు వస్తుందని.. కాబోయే ఎమ్మెల్యేన నేనే అని ఆయన అనుచరులకు చెప్పుకున్నారు. టికెట్ కోసం అధిష్టానం దృష్టిలో పడాలనే ఆరాటంతో ముగ్గురు నేతలు ప్రజా సేవా కార్యక్రమాలను పోటీపోటీగా నిర్వహిస్తున్నారు. కర్నూలులో పార్టీ, ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా బలప్రదర్శనకు దిగుతున్నారు.

ఇటీవల పలువురు మంత్రులు నగరంలో కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇందుకు జన సమీకరణ చేయాలని పార్టీ పరంగా ఆదేశాలు రాగా.. ముగ్గురూ ఎవరికి వారే అనే చందంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. ముగ్గురూ విడివిడిగా జనాలను తీసుకొని వచ్చి.. మంత్రుల ముందు తమ బలాన్ని ప్రదర్శించుకున్నారు. ఈ ముగ్గురి ఆధిపత్య పోరు కారణంగా వైసీపీ క్యాడర్‌లో ఆయోమయం నెలకొన్నది. ఇలాగే కొనసాగితే కర్నూలులో వైసీపీ దెబ్బతినడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో సీనియర్ నాయకులు ముగ్గురి మధ్య సయోధ్య కుదర్చడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు కోసం ప్రయత్నించాలని, ఇలా బజారున పడి పరువు పోగొట్టుకోవద్దని చెప్పినట్లు సమాచారం.

First Published:  28 Aug 2022 11:03 AM GMT
Next Story