Telugu Global
Andhra Pradesh

భూమా అఖిల ప్రియకి బెయిల్.. సందిగ్ధంలో పొలిటికల్ కెరీర్!

న్యాయస్థానంలో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ పడింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్రకి దూరమైన భూమా అఖిల ప్రియ.. అతను ఉమ్మడి కర్నూలు జిల్లా దాటే వరకూ కూడా బయటికి రాలేకపోయింది.

భూమా అఖిల ప్రియకి బెయిల్.. సందిగ్ధంలో పొలిటికల్ కెరీర్!
X

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఎట్టకేలకి బెయిల్ మంజూరైంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియ ప్రస్తుతం కర్నూలు జైలులో ఉండగా.. న్యాయస్థానం ఆమెకి బెయిల్ ఇచ్చింది. దాంతో త్వరలోనే ఆమెను జైలు నుంచి విడుదల చేయనున్నారు. కానీ రోజుల వ్యవధిలోనే ఆమె పొలిటికల్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. దానికి కారణం ఆమె ఇటీవల ప్రదర్శించిన అత్యుత్సాహమే.

యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్‌‌కి ఈ నెల 17న నంద్యాలలోని కొత్తపల్లిలో భారీ స్వాగత ఏర్పాట్లని భూమా అఖిల ప్రియ చేసింది. కానీ అదే సమయంలో ఏవీ సుబ్బారెడ్డి కూడా పోటీగా స్వాగత ఏర్పాట్లు చేశాడు. దాంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి.. అది చివరికి ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పురిగొల్పింది. భూమా అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడిచేసి రక్తం వచ్చేలా కొట్టారు. దాంతో అతను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. గంటల వ్యవధిలోనే అఖిల ప్రియతో పాటు ఆమె భర్త, మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని న్యాయస్థానంలో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ పడింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్రకి దూరమైన భూమా అఖిల ప్రియ.. అతను ఉమ్మడి కర్నూలు జిల్లా దాటే వరకూ కూడా బయటికి రాలేకపోయింది. ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర కడప జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతోంది.

వాస్తవానికి నంద్యాల, ఆళ్లగడ్డలో తమ కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని గత కొంతకాలంగా భూమా అఖిల ప్రియ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో అఖిల ప్రియ (ఆళ్లగడ్డ), భూమ బ్రహ్మానంద రెడ్డి (నంద్యాల) ఓడిపోయారు. అయినప్పటికీ నెక్ట్స్ ఎలక్షన్స్‌లోనూ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కానీ.. నంద్యాల నుంచి ఏవీ సుబ్బారెడ్డి టికెట్ ఆశిస్తున్నాడు. ఇక్కడే ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. దాంతో నారా లోకేష్‌ పాదయాత్రని సక్సెస్ చేయడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని అఖిల ప్రియ ఆశించింది. కానీ.. గొడవ‌తో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. నంద్యాలలో ఆ గొడవకి కారణాలు తేల్చాల్సిందిగా చంద్రబాబు ఓ ముగ్గురు సభ్యులతో కమిటీ వేయగా.. భూమా అఖిల ప్రియదే తప్పు అని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో చంద్రబాబు ఆమె విషయంలో గుర్రుగా ఉన్నారు.

భూమా అఖిల ప్రియ వ్యవహార శైలిపై గత కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి హత్యకి ఆమె భర్త కుట్ర చేస్తున్నాడని ఇటీవల కనిపెట్టిన కడప పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏవీ సుబ్బారెడ్డితో విభేదాల విషయంలోనూ చంద్రబాబు ఇప్పటికే ఆమెని పలుసార్లు హెచ్చరించారు. కానీ మారని ఆమె తీరు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో రాబోవు ఎన్నికల్లో ఆమెని పూర్తిగా పక్కనపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. భూమా అఖిల ప్రియ స్థానంలో ఆమె సోదరి భూమా మౌనికని ఆళ్లగడ్డలో టీడీపీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూమా మౌనికని ఇటీవల హీరో మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

First Published:  25 May 2023 3:09 AM GMT
Next Story