Telugu Global
Andhra Pradesh

కాంతి-క్రాంతిపై సెటైర్లు.. టీడీపీ ఆరిపోయే దీపం అంటూ కౌంటర్లు

వాస్తవానికి జనం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. టీడీపీ నేతలు మాత్రం ప్రచారం కోసం, మీడియాలో కనపడ్డం కోసం కొవ్వొత్తులు, దీపాలు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి ఓ రేంజ్ లో సెటైర్లు పడుతున్నాయి.

కాంతి-క్రాంతిపై సెటైర్లు.. టీడీపీ ఆరిపోయే దీపం అంటూ కౌంటర్లు
X

చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా ఇంట్లో దీపాలు ఆర్పేసి, వీధిలో దీపాలతో నిరసన తెలియజేశారు టీడీపీ నేతలు. కాంతి-క్రాంతి అనే ఈ కార్యక్రమం ఓ రేంజ్ లో సక్సెస్ అయిందని ఎల్లో మీడియా డబ్బా కొడుతోంది. ఊరూవాడా అందరూ దీపాలు ఆర్పేశారని అంటున్నారు టీడీపీ నేతలు. కానీ వాస్తవానికి జనం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. టీడీపీ నేతలు మాత్రం ప్రచారం కోసం, మీడియాలో కనపడ్డం కోసం కొవ్వొత్తులు, దీపాలు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి ఓ రేంజ్ లో సెటైర్లు పడుతున్నాయి. ఆరిపోయే దీపంలా ఉన్న టీడీపీ, ఈ కార్యక్రమం ద్వారా తన భవిష్యత్తుని సింబాలిక్ గా చూపెట్టిందని ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.


మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా..! అంటూ టీడీపీకి కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలని జనం అనుకుంటున్నారని చెప్పారు. కొంతమంది నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారని, వారి ఆనందమే వేరు అని అన్నారు. "మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్ గా చెప్పడం ఏదైతో ఉందో... నభూతో నభవిష్యత్" అంటూ సెటైరిక్ గా ట్వీట్ వేశారు విజయసాయి.

చంద్రబాబు ఎన్నో కుటుంబాల దీపాల్ని ఆర్పేశారని.. అలాంటి వ్యక్తి కోసం కొత్తగా దీపాల్ని ఆర్పడం ఏంటని ఇదివరకే మంత్రి అంబటి రాంబాబు కూడా కాంతి-క్రాంతి కార్యక్రమానికి కౌంటర్ ఇచ్చారు. ఆమధ్య విజిల్స్ వేయడం, వాహనాల హారన్లు కొట్టడం, పల్లంపై గరిటెతో శబ్దం చేయడం, గంట కొట్టడం వంటి కామెడీలు కూడా చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు దీపాలు ఆర్పేసి బాబుకోసం మేము అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల పరమార్థం ఏంటో తెలియదు కానీ, ఇవన్నీ విజయవంతం అయ్యాయని టీడీపీ చెప్పుకోవడమే అన్నిటికీ మించిన హైలైట్.

First Published:  8 Oct 2023 5:34 AM GMT
Next Story