Telugu Global
Andhra Pradesh

పొలిటికల్ గేమ్ లో ఓడిపోయిన కోలా గురువులు..

గ్యారెంటీగా ఓట్లు వేస్తారనుకున్న వారిని మిగతా అభ్యర్థులకు కేటాయించి, అనుమానం ఉన్నవారిని కోలా గురువులుకి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది.

పొలిటికల్ గేమ్ లో ఓడిపోయిన కోలా గురువులు..
X

ఏడు స్థానాలు అలవోకగా గెలుస్తామనే ఉద్దేశంతోనే వైసీపీ ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను బరిలో దింపింది. సామాజిక వర్గాల లెక్కలు వేసి మరీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామని చెబుతూ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. అయితే టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టడంతో పొలిటికల్ గేమ్ మొదలైంది. ఈ గేమ్ లో కోలా గురువులు ఓడిపోయారు.

22 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చినవారు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థుల్లో ఇద్దరికి చెరో 21 ఓట్లు వచ్చాయి. జయమంగళ వెంకట రమణ, కోలా గురువులు.. వీరిద్దరిలో రెండో ప్రాధాన్యత లెక్క తీసి విజేతను నిర్ణయించారు. జయమంగళ ఎమ్మెల్సీ కాగా, కోలా పరాజితుడిగా నిలిచారు. ఎమ్మెల్యేల కేటాయింపు సమయంలోనే వీరిద్దరి విషయంలో ఏదో తేడా జరుగుతుందని వైసీపీ అధిష్టానం ఊహించినట్టు తెలుస్తోంది. వచ్చే దఫా ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేము అని కొంతమందికి సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో వారు అసంతృప్తిగా ఉన్నారని తెలిసి కూడా జయమంగళకు ఒకరిని, కోలా గురువులుకి మరొకర్ని కేటాయించారు. చివరకు కోలా ఓటమి పాలయ్యారు.

ఎవరీ గురువులు..?

విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ నేత, మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా పని చేసిన కోలా గురువులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన, అప్పట్లో విశాఖ దక్షిణం నుంచి పోటీ చేసి ద్రోణం రాజు శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ చేతిలో ఓడిపోయారు. 2019లో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ హామీతో పార్టీలోనే కొనసాగారు. చివరకు ఇప్పుడు ఆ ఆశ కూడా నెరవేరలేదు. గ్యారెంటీగా ఓట్లు వేస్తారనుకున్న వారిని మిగతా అభ్యర్థులకు కేటాయించి, అనుమానం ఉన్నవారిని కోలా గురువులుకి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది.

మొత్తమ్మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొలిటికల్ గేమ్ లో కోలా గురువులు బలయ్యారు. గ్యారెంటీగా ఓట్లు వేస్తారనుకున్న ఎమ్మెల్యేలను కేటాయిస్తే కచ్చితంగా ఆయన గెలిచేవారేమో. అనుమానం ఉన్నవారిని కేటాయించడం, అందులోనూ రెండో ప్రాధాన్యత ఓటుతో జయమంగళ వెంకటరమణ గెలవడంతో.. కోలా వర్గం రగిలిపోతోంది. మరి ఈసారి ఆయనకు జగన్ ఎలాంటి హామీ ఇచ్చి బుజ్జగిస్తారో చూడాలి.

First Published:  24 March 2023 2:15 AM GMT
Next Story