Telugu Global
Andhra Pradesh

గుడివాడ అభివృద్ధిపై చంద్ర‌బాబుతో చ‌ర్చ‌కు సిద్ధం.. - కొడాలి నాని స‌వాల్‌

చంద్ర‌బాబు పూల‌మాల‌లు వేసిన ఎన్టీఆర్‌, బ‌స‌వ‌తార‌కం విగ్రహాలు కూడా ఆయ‌న ఏర్పాటు చేసిన‌వి కాద‌ని, వాటిని తాను, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌మ సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేశామ‌ని కొడాలి నాని చెప్పారు.

గుడివాడ అభివృద్ధిపై చంద్ర‌బాబుతో చ‌ర్చ‌కు సిద్ధం.. - కొడాలి నాని స‌వాల్‌
X

గుడివాడ అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స‌వాల్ చేశారు. గుడివాడ‌లో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో నాని మాట్లాడారు. గుడివాడ‌లో 23 వేల మంది పేద‌ల‌కు ఇళ్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రానికి చంద్ర‌బాబు చేసింది ఏమీ లేద‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లు బాబును విశ్వ‌సించే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న చెప్పారు.

గుడివాడ‌లో పేద‌ల ఇళ్ల స్థ‌లాల కోసం ఒక్క ఎక‌ర‌మైనా కొన్న‌ట్టు నిరూపించ‌గ‌ల‌రా అని కొడాలి నాని నిల‌దీశారు. చంద్ర‌బాబు నిరూపిస్తే తాను రాజ‌కీయాలు వ‌దిలేస్తాన‌ని స‌వాల్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా గుడివాడ‌లో ప్ర‌స్తుతం అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అప్ప‌ట్లో వైఎస్సార్‌, ఇప్పుడు సీఎం జ‌గ‌న్ పేద‌లకు ఇళ్ల స్థ‌లాల కోసం భూములు సేక‌రించార‌ని ఈ సంద‌ర్భంగా కొడాలి నాని తెలిపారు.

హ‌రికృష్ణ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఎన్టీఆర్ స్వ‌గ్రామ‌మైన నిమ్మ‌కూరును అభివృద్ధి చేశార‌ని నాని చెప్పారు. నిమ్మ‌కూరుపై జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి, హ‌రికృష్ణ‌కి ఉన్న చిత్త‌శుద్ధి చంద్ర‌బాబుకు లేద‌న్నారు. చంద్ర‌బాబు పూల‌మాల‌లు వేసిన ఎన్టీఆర్‌, బ‌స‌వ‌తార‌కం విగ్రహాలు కూడా ఆయ‌న ఏర్పాటు చేసిన‌వి కాద‌ని, వాటిని తాను, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌మ సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేశామ‌ని కొడాలి నాని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌కు దండ‌లు వేయ‌డానికి చంద్ర‌బాబుకు సిగ్గులేద‌ని ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ప్ర‌చారం చేసిన ప్ర‌తిసారీ గుడివాడ‌లో టీడీపీ ఓట‌మికి గురైంద‌ని, ఈసారి కూడా వ‌చ్చార‌ని, ఈసారీ ఓట‌మి త‌థ్య‌మ‌ని నాని స్ప‌ష్టంచేశారు. జ‌నం లేక ఖాళీగా ఉన్న కుర్చీల‌కే ఆయ‌న గుడివాడ స‌భ‌లో గంట‌సేపు మాట్లాడార‌ని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

First Published:  14 April 2023 7:28 AM GMT
Next Story