Telugu Global
Andhra Pradesh

పాలు, పిడకలు అమ్మితే 10వేల కోట్లు వస్తాయా..?

ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పాలన్నారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వస్తుందా అన్నారు నాని. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదన్నారు.

పాలు, పిడకలు అమ్మితే 10వేల కోట్లు వస్తాయా..?
X

చంద్రబాబు మౌనంగా ఉంటూ, ఆయన అనుకూల మీడియా ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తూ ఐటీ నోటీసులపై కాలం జరిపేయాలని చూస్తున్నారు. కాలం గడిచిపోతే నోటీసుల సంగతి ఎవరూ పట్టించుకోరనే వ్యూహంలో ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం పదే పదే అదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులిచ్చిన వ్యవహారాన్ని వైసీపీ నేతలు అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు. చంద్రబాబు ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నిస్తున్నారు, పవన్ కల్యాణ్ ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందని లాజిక్ తీస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై ఇదే విషయంలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఏతప్పూ చేయకపోతే చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.

అరెస్ట్ ఖాయం..

తనను త్వరలో అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు కొట్టడాన్ని తప్పుబట్టారు కొడాలి నాని. తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దుపెట్టుకుంటారా అని ప్రశ్నించారాయన. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు చేస్తే అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా? అన్నారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పాలన్నారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వస్తుందా అన్నారు నాని. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదన్నారు. దోచుకున్న బ్లాక్ మనీని వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు కొడాలి నాని.

సెల్ఫీలేంటయ్యా బాబూ..!

అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజలకు చెప్పాలని, అంతే కానీ.. చంద్రబాబు సెల్ఫీలు దిగడమేంటని ఎద్దేవా చేశారు నాని. హైదరాబాద్ తానే కట్టానంటున్న చంద్రబాబు.. అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. పిట్టలదొర లేని లోటుని ఆయన తీరుస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని సంపదని దోచుకోవాలని దుష్టచతుష్టయం కుట్రలు పన్నుతోందని విమర్శించారు నాని.

First Published:  7 Sep 2023 10:45 AM GMT
Next Story