Telugu Global
Andhra Pradesh

చెల్లెమ్మ.. వదినమ్మతో చంద్రబాబు కుట్రలు

చంద్రబాబుతోపాటు బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు.. అందర్నీ కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

చెల్లెమ్మ.. వదినమ్మతో చంద్రబాబు కుట్రలు
X

నిన్నటి వరకు చంద్రబాబు టీమ్ లో సొంత పుత్రుడు, దత్త పుత్రుడు మాత్రమే ఉండేవారు. ఇటీవల వదినమ్మ, చెల్లెమ్మ కూడా ఆ టీమ్ లో జాయిన్ అయ్యారు. చెల్లెమ్మ, వదినమ్మలతో కలసి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుతోపాటు బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు.. అందర్నీ కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒంటరిగా జగన్‌ ని ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు అందరినీ వెంటబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు కొడాలి నాని. వారందరూ ఉన్నా కూడా ధైర్యం సరిపోక ఢిల్లీ పెద్దలను కూడా మబ్బులో పెడదామని వెళ్ళారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా ఇచ్చిన ఆఫర్ దెబ్బకు.. హైదరాబాద్ వెళ్లి మంచంపై పడి వారం నుంచి ఏపీకి రావడం లేదని సెటైర్లు పేల్చారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారిందన్నారు కొడాలి నాని.

పవన్ హెలికాప్టర్ డ్రామా..

పవన్ హెలిప్యాడ్ అనుమతి అంశంపై కూడా కొడాలి నాని స్పందించారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కు స్థానిక అధికారులు ఒప్పుకోకపోవడంతో.. పవన్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారని, కానీ అసలు కారణం వేరే ఉందన్నారు. జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే ప్రశ్నలు వస్తాయని, ఆప్రశ్నకి సమాధానం లేకే కేడర్ దగ్గరకు వెళ్లడానికి దత్తపుత్రుడు భయపడ్డారని, ఆ భయంతోనే హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు కొడాలి. ఢిల్లీ పెద్దలు చెబితేనే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయంలో క్లారిటీ వస్తుందన్నారు. భీమవరం ఊరి చివర హెలికాప్టర్ ల్యాండింగ్ చేసి, సభా ప్రాంగణం దగ్గరకు పవన్ రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం ఉందని, అయినా ఆయన రాకపోవడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఒకవేళ పవన్ భీమవరం ఎమ్మెల్యే అయినా కూడా హెలిప్యాడ్ లేదనే సాకుతో ఆయన నియోజకవర్గం మొహం కూడా చూడరని కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని.

First Published:  14 Feb 2024 2:31 PM GMT
Next Story