Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై మళ్లీ ఫైర్ అయిన కొడాలి నాని.. ఎవర్ని తెచ్చుకున్నా గెలుపు నాదే.!

గుడివాడలో గతంలో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతుంది. ఎవర్ని తెచ్చుకున్నా.. వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా, కులసంఘాలు ఎన్ని వచ్చినా గుడివాడలో గెలుపోటములను ప్రభావితం చేయలేరని అన్నారు.

చంద్రబాబుపై మళ్లీ ఫైర్ అయిన కొడాలి నాని.. ఎవర్ని తెచ్చుకున్నా గెలుపు నాదే.!
X

ఏపీలోని గుడివాడ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. టీడీపీ నుంచే తొలిసారి ఎమ్మెల్యే అయిన నాని.. గత రెండు పర్యాయాలు మాత్రం వైసీపీ తరపున గెలిచారు. గుడివాడ నుంచి 2004 నుంచి నానికి ఓటమే లేదు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో 2019లో నాని గెలవకూడదని చంద్రబాబు అనేక వ్యూహాలు రచించారు. ఏకంగా దేవినేని అవినాశ్‌ను బరిలోకి దింపినా.. నాని గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయారు. ఆ తర్వాత అవినాశ్ కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు.

తాజాగా గుడివాడలో నానికి పోటీగా ఓ ఎన్ఆర్ఐని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్, రాబిన్ శర్మ.. లేకపోతే ఇంకెవరైనా అమెరికాలో ఉండే నలుగురు పనికిమాలిన వ్యక్తులకు గుడివాడలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలో నిర్ణయించే శక్తి, సామర్థ్యాలు ఉండవని అన్నారు. తెలుగు దేశం పార్టీ చందాలు వేసుకొని రూ. 100 కోట్లో లేదంటే రూ. 200 కోట్లో ఇక్కడికి పంపిస్తే.. హాయిగా రూ. 5వేలు, రూ. 10వేలు పంచి గెలుద్దామనే భ్రమలో కొంత మంది ఉన్నారు. అలా డబ్బులు తీసుకొని గుడివాడ ప్రజలు ఓటేస్తారంటే అది పెద్ద పరాభవమే అన్నారు.

గుడివాడలో గతంలో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతుంది. ఎవర్ని తెచ్చుకున్నా.. వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా, కులసంఘాలు ఎన్ని వచ్చినా గుడివాడలో గెలుపోటములను ప్రభావితం చేయలేరని అన్నారు. ఎవరు గెలవాలి, ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలనేది ఓటర్లు డిసైడ్ చేస్తారని నాని చెప్పారు.

చంద్రబాబు పర్యటనలు అన్నీ సినిమా షూటింగ్స మాదిరిగా జరుగుతున్నాయని నాని ఎద్దేవా చేశారు. జిల్లా పర్యటనలో టీడీపీ కార్యకర్తలనే ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబుకే కాదు.. ఈ ఎన్నికలు టీడీపీకి కూడా చివరివని నాని జోస్యం చెప్పారు. తెలంగాణలో అసలు పార్టీనే లేదు, ఇప్పుడు ఏపీలో వెంటిలేటర్‌పై ఉన్నదని నాని అన్నారు. చంద్రబాబును మించిన సైకో లేరని నాని మండి పడ్డారు. న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు గురించి అడిగితే.. గుడ్డలూడదీసి కొడతా అని చంద్రబాబు అన్నారు. అలాంటి మాటలు సైకోలకే వస్తాయని మండిపడ్డారు. 2024 తర్వాత ఇదేం కర్మరా అని చంద్రబాబు, లోకేశ్ అనుకుంటారని నాని అన్నారు. బతికున్నంత కాలం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని.. తన చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

కాగా, గుడివాడ నుంచి ఎన్ఆర్ఐ అయిన రాము అనే వ్యక్తిని బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు గుడివాడలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్లు కూడా తెలుస్తున్నది. మరికొన్ని రోజుల్లో వెనిగళ్ల రాము నియోజవర్గానికి వస్తారని.. అప్పటి నుంచి నాని ఇక రోజులు లెక్కబెట్టుకోవల్సిందేనని కొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే నాని విలేకరుల సమావేశం పెట్టి అందరికీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

First Published:  22 Nov 2022 3:55 AM GMT
Next Story