Telugu Global
Andhra Pradesh

ఏపీలో అందుబాటులోకి కిసాన్ డ్రోన్లు..! - రైతులే డ్రోన్ పైల‌ట్లు

తొలి ద‌శ‌లో 1,961 రైతు భ‌రోసా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. వాటిలో ఇప్ప‌టికే 738 ఆర్బీకేల ప‌రిధిలో ఐదుగురు స‌భ్యుల‌తో రైతు గ్రూపుల‌ను ఏర్పాటు చేశారు.

ఏపీలో అందుబాటులోకి కిసాన్ డ్రోన్లు..! - రైతులే డ్రోన్ పైల‌ట్లు
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు భ‌రోసా కేంద్రాల్లో (ఆర్బీకే) కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించింది. వాటిని న‌డిపేందుకు రైతు గ్రూపుల్లో ఎంపిక చేసిన రైతుల‌కు ప్ర‌భుత్వ‌మే శిక్ష‌ణ ఇవ్వ‌నుంది. ఈ నెల 28 నుంచి శిక్ష‌ణకు శ్రీ‌కారం చుడుతున్న ప్ర‌భుత్వం మండ‌లానికి 3 చొప్పున తొలి ద‌శ‌లో 2 వేల రైతు భ‌రోసా కేంద్రాల్లో కిసాన్ డ్రోన్లు ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించింది.

తొలి ద‌శ‌లో 1,961 రైతు భ‌రోసా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. వాటిలో ఇప్ప‌టికే 738 ఆర్బీకేల ప‌రిధిలో ఐదుగురు స‌భ్యుల‌తో రైతు గ్రూపుల‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన ఆర్బీకేల ప‌రిధిలో డిసెంబ‌ర్ 15 నాటికి గ్రూపుల‌ను ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

డ్రోన్ పైల‌ట్ శిక్ష‌ణ‌కు నిబంధ‌న‌లు ఇలా..

డ్రోన్ పైలట్ శిక్ష‌ణ‌కు అధికారులు ప‌లు నిబంధ‌న‌లు రూపొందించారు. డైరెక్ట‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) నిబంధ‌న‌ల మేర‌కు వ్య‌వ‌సాయ డ్రోన్ పైల‌ట్‌గా శిక్ష‌ణ పొందాలంటే 18-65 ఏళ్ల వ‌య‌సు క‌లిగి ఉండాలి. విద్యార్హ‌త‌.. వ్య‌వ‌సాయ డిప్లొమా లేదా వ్య‌వ‌సాయ ఇంజ‌నీరింగ్ డిప్లొమా లేదా క‌నీసం ఇంట‌ర్మీడియ‌ట్ తత్స‌మాన అర్హ‌త అవ‌స‌రం. మెడిక‌ల్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌తో పాటు పాస్‌పోర్ట్ కూడా ఉండాలి. రైతు గ్రూపుల్లో ఈ అర్హ‌త‌లు ఉన్న‌వారిని డ్రోన్ పైల‌ట్లుగా ఎంపిక చేశారు.

శిక్ష‌ణ‌కు ఇటీవ‌లే అనుమ‌తి..

వ్య‌వ‌సాయ‌, సంప్ర‌దాయ డ్రోన్ పైల‌ట్ శిక్ష‌ణ ఇచ్చేందుకు ఇటీవ‌లే ఎన్జీ రంగా వ్య‌వ‌సాయ విద్యాల‌యం ద్వారా రిమోట్ పైల‌ట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్‌పీటీసీ)కి డీజీసీఐ అనుమ‌తి ఇచ్చింది. ఈ నెల 28 నుంచి బ్యాచ్‌కి 20 మంది చొప్పున 12 రోజుల‌పాటు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక పాఠ్య ప్ర‌ణాళిక కూడా ఎన్జీ రంగా వ‌ర్సిటీ రూపొందించింది. 10 ప్ర‌ధాన పంట‌ల సాగులో డ్రోన్ల వినియోగంపై విధివిధానాల‌ను ఇందులో పొందుప‌ర్చింది. శిక్ష‌ణ అనంత‌రం డీజీసీఐ స‌ర్టిఫికెట్ కూడా రైతుల‌కు అందిస్తారు. ఈ శిక్ష‌ణ‌కు ఒక్కొక్క రైతుకు రూ.17 వేల వ్య‌యం కానుండ‌గా, ఆ ఖ‌ర్చంతా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంది.

మార్చిలోగా అందుబాటులోకి..

తొలి ద‌శ‌లో నిర్దేశించిన 2 వేల ఆర్బీకేల్లో మార్చిలోగా కిసాన్ డ్రోన్ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు వెళుతున్నామ‌ని వ్య‌వ‌సాయ శాఖ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ చేవూరు హ‌రికిర‌ణ్ తెలిపారు. వ్య‌వ‌సాయ‌, సంప్ర‌దాయ డ్రోన్ల‌పై 2 వేల మంది రైతుల‌కు ద‌శల‌వారీగా శిక్ష‌ణ అందించ‌నున్నామ‌ని ఎన్జీ రంగా వ‌ర్సిటీ వీసీ డాక్ట‌ర్ ఆదాల విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు.

First Published:  27 Nov 2022 3:12 AM GMT
Next Story