Telugu Global
Andhra Pradesh

రెండోరోజు విచారణకు కిలారు రాజేశ్‌ గైర్హాజరు.. - దసరా తర్వాత వస్తానంటూ మెయిల్‌

టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాల్లో నారా లోకేశ్, కిలారు రాజేశ్‌ ప్రధాన పాత్ర పోషించినట్లు సీఐడీ గుర్తించింది. ఆ విషయాన్ని సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ ప్రకటించడంతో తొలుత కిలారు రాజేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

రెండోరోజు విచారణకు కిలారు రాజేశ్‌ గైర్హాజరు.. - దసరా తర్వాత వస్తానంటూ మెయిల్‌
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న లోకేశ్‌ సన్నిహితుడు కిలారు రాజేశ్‌ రెండోరోజు విచారణకు డుమ్మా కొట్టాడు. సోమవారం విచారణకు హాజరైన రాజేశ్‌.. మంగళవారం మాత్రం గైర్హాజరయ్యాడు. తాను ప్రస్తుతం విచారణకు రాలేనని, దసరా తరువాత వస్తానంటూ ఈ మెయిల్‌ పంపడం గమనార్హం. సీఐడీ అధికారులు తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానంటూ నమ్మబలికిన కిలారు రాజేశ్‌ రెండో రోజు మాత్రం గైర్హాజరయ్యాడు.

టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాల్లో నారా లోకేశ్, కిలారు రాజేశ్‌ ప్రధాన పాత్ర పోషించినట్లు సీఐడీ గుర్తించింది. ఆ విషయాన్ని సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ ప్రకటించడంతో తొలుత కిలారు రాజేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చంద్రబాబు, లోకేశ్‌ల ఆదేశాల మేరకే రాజేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, షెల్‌ కంపెనీల ప్రతినిధి మనోజ్‌ పార్థసాని అప్పటికే విదేశాలకు పరారు కావడం గమనార్హం.

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ తరఫు న్యాయవాదులు ఇదే వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించడం తెలిసిందే. కేసు దర్యాప్తును చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం అనివార్యంగా సోమవారం నాడు సిట్‌ విచారణకు హాజరైన రాజేశ్‌.. కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో బెంబేలెత్తిపోయాడు.

ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, కాంట్రాక్టులకు సంబంధించిన పత్రాల గురించి సిట్‌ అధికారులు ప్రశ్నంచినట్లు సమాచారం. ప్రస్తుతం అవి తనవద్ద లేవని, ఇంట్లో ఉన్నాయని, సమయం ఇస్తే వాటిని తెస్తానని చెప్పిన కిలారు రాజేశ్‌ మర్నాడు పత్తా లేకుండా పోవడం గమనార్హం. దసరా తరువాత మాత్రమే విచారణకు వస్తానంటూ మెయిల్‌ పంపిన కిలారు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వెనుక లోకేశ్, చంద్రబాబుల హస్తం ఉన్నట్టు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  18 Oct 2023 2:45 AM GMT
Next Story