Telugu Global
Andhra Pradesh

కాపు నేతల కీలక సమావేశం

సమావేశం నిర్వహణ బాధ్యతను తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజాప్రతినిధులే తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద పవన్‌కు వైసీపీ కాపు నేతల నుండి గట్టి సవాలే ఎదురయ్యేట్లుంది.

కాపు నేతల కీలక సమావేశం
X

ఈ నెల 31న కాపు నేతల కీలక సమావేశం జరగబోతోంది. అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలు కూడా సమావేశమవుతున్నారు. రాజమండ్రిలో జరగబోతున్న ఈ సమావేశం ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరికి వ్యతిరేకంగానే ఉండబోతోంది. ఈ మధ్య పార్టీ నేతల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులకు చెప్పు చూపించి బూతులు తిట్టిన విషయం తెలిసిందే.

పవన్ తన స్పీచులో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో అందరికీ మండుతోంది. అందుకనే పవన్ వైఖరిపై చర్చించి ఒక తీర్మానాన్ని చేసే ఉద్దేశంతోనే కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు హాజరవబోతున్నారు. ఈ నెల 31న జ‌రిగే సమావేశంలో పవన్ వైఖరిపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. పవన్‌కు వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయాలని అనుకున్నారు.

సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తర్వాత కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులు, కాపు సంఘాల్లోని కీలక వ్యక్తులతో రెండో సమావేశం పెట్టాలని డిసైడ్ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి పవన్ వల్ల జరుగుతున్న నష్టం విషయమై చర్చించబోతున్నట్లు సమాచారం. పవన్ మొదటి నుండి కూడా పేర్ని నానిని టార్గెట్‌గా పెట్టుకుని అనేక వ్యాఖ్యలు చేశారని, తాజాగా మంత్రులు డాడిశెట్టి రాజా, గుడివాడ అమర్‌నాథ్‌ లాంటి వాళ్ళకు చెప్పులు చూపించి బూతులు తిడుతూ వార్నింగ్‌లు ఇవ్వటాన్ని కాపులందరు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఇలాంటి అనేక విషయాలపై ఈ నెల 31న సుదీర్ఘంగా చర్చ జరపాలని డిసైడ్ అయ్యారు. ఆ సమావేశంలో ఎవరెవరు మాట్లాడాలి, ఏ విషయాలపై మాట్లాడాలనే అజెండా రెడీ అవుతోంది. సమావేశం నిర్వహణ బాధ్యతను తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజాప్రతినిధులే తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద పవన్ కు వైసీపీ కాపు నేతల నుండి గట్టి సవాలే ఎదురయ్యేట్లుంది. వీళ్ళే కాకుండా పార్టీలకు అతీతంగా కాపు ప్రముఖలందరినీ పవన్‌కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. మరీ వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది ఈ నెల 31న జ‌రిగే సమావేశం మీద ఆధారపడుంది.

First Published:  29 Oct 2022 7:12 AM GMT
Next Story