Telugu Global
Andhra Pradesh

కేవీపీ.. ఇంకా ఆశలున్నాయా? కాంగ్రెస్ పరిస్థితిపై సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. 2029 నాటికైనా ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని ఆయన ఆశతో ఉన్నారు.

కేవీపీ.. ఇంకా ఆశలున్నాయా?  కాంగ్రెస్ పరిస్థితిపై సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
X

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అంటే అసలు ఆ పార్టీ అంటూ ఒకటుందా? అని తడుముకోకుండా చిన్నపిల్లాడైనా ఆన్సర్ ఇస్తుంటారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు తులసిరెడ్డి లాంటి నేతలు పత్రికాప్రకటనలు విడుదల చేయడం.. రాహుల్ గాంధీ యాత్ర కోసం వచ్చినప్పుడు ఏదో కొంచెం హడావుడి చేయడం తప్ప.. ఏపీలో కాంగ్రెస్ కార్యక్రమాలు నామమాత్రంగా కూడా ఉండవు.

పరిస్థితి ఇలా ఉంటే సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. 2029 నాటికైనా ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని ఆయన ఆశతో ఉన్నారు. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. విభజన అనంతరం మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ముఖ్యనేతలు కూడా ఆ పార్టీని వీడి.. వైసీపీ, టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్ మెజార్టీ క్యాడర్ వైసీపీలో ఉండిపోయింది.

ఇదిలా ఉంటే కొంతమంది ప్రజల్లో పట్టులేని నేతలు మాత్రం అలాగే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఇటువంటి పార్టీ పరిస్థితి గురించి కేవీపీ రామచంద్రరావు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి గిడుగు రుద్రరాజు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అప్పడప్పుడు పత్రికా ప్రకటనలు తప్ప ఆయన ఏమీ స్పందించరు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక శైలజానాథ్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. మరి పార్టీ ఎలా వృద్ధిలోకి వస్తుంది? కేవీపీ మనసులో ఉన్న ఆలోచన ఏమిటో తెలియాల్సి ఉంది.

First Published:  11 Dec 2022 12:17 PM GMT
Next Story