Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై కేశినేని పొగడ్తలు.. నమ్మొచ్చా..?

కంచిక‌చ‌ర్ల‌లో వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న నాని, తాను టీడీపీలోనే ఉన్నానని, తన ఐడియాలజీ టీడీపీదేనని చెప్పారు. టీడీపీ నుంచే ఎంపీగా మూడోసారి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.

చంద్రబాబుపై కేశినేని పొగడ్తలు.. నమ్మొచ్చా..?
X

చంద్రబాబుపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ, ఆయన పర్యటనలలో అంటీ ముట్టనట్టుగా ఉంటూ, అసలు లోకేష్ యువగళానికి పూర్తిగా దూరంగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని హఠాత్తుగా ప్లేటు మార్చారు. అసలు నాని టీడీపీకి దూరమైపోతున్నారనుకుంటున్న ఈ సందర్భంలో సడన్ గా చంద్రబాబుపై ప్రేమ కురిపించారు, టీడీపీతోనే తన రాజకీయ జీవితం అన్నారు. ఇంతకీ నానిలో ఈ సడన్ మార్పుకి కారణం ఏంటి..?

విజయవాడలో తన సోదరుడు కేశినేని చిన్నిని చంద్రబాబు దగ్గరకు తీశారని, తనకు చెక్ పెట్టబోతున్నారనేది నాని అనుమానం. అనుమానమేం కాదు, అదే నిజం అని టీడీపీ వర్గాల సమాచారం. ఆ వార్తలను బలపరుస్తూ విజయవాడలో లోకేష్ యువగళం యాత్రకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు చిన్ని. అయితే నాని ఇంకా టీడీపీపై ఆశలు చంపుకోలేకపోతున్నారు. పక్క పార్టీల్లోకి వెళ్లే ప్రయత్నాలు బెడిసికొట్టాయో లేక టీడీపీయే తనకు బెటర్ అనుకున్నారో.. మొత్తానికి టీడీపీతోనే కలసి వెళ్లాలనుకుంటున్నారు నాని.

కంచిక‌చ‌ర్ల‌లో వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న నాని, తాను టీడీపీలోనే ఉన్నానని, తన ఐడియాలజీ టీడీపీదేనని చెప్పారు. టీడీపీ నుంచే ఎంపీగా మూడోసారి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పనిలో పనిగా చంద్రబాబుపై కూడా పొగడ్తల వర్షం కురిపించారు నాని. నిస్వార్ధంగా అవినీతి మ‌చ్చ లేకుండా రాష్ట్రాన్ని పాలించిన నాయకుడు చంద్రబాబు అని చెప్పుకొచ్చారు నాని. చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు పెద్ద సమస్య కాదన్నారు. నోటీసులు రాజకీయ ఒత్తిడిలో ఒక భాగమని, అది చాలా రొటీన్ అన్నారు. నోటీసులు వ‌చ్చినా స‌మాధానం చెప్పుకునే నిబ‌ద్ద‌త‌, క‌మిట్ మెంట్ చంద్ర‌బాబు వ‌ద్ద ఉందన్నారు నాని. దేశ రాజకీయాల్లో అవినీతి మ‌ర‌క అంట‌ని కొద్ది మందిలో చంద్ర‌బాబు ఒక‌రని కితాబిచ్చారు నాని. రాష్ట్రంకోసం 40ఏళ్లుగా ఆయన కష్టపడుతూనే ఉన్నారని చెప్పారు. సడన్ గా నాని నోటి వెంట చంద్రబాబుపై పొగడ్తలు వినేసరికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

First Published:  8 Sep 2023 8:26 AM GMT
Next Story