Telugu Global
Andhra Pradesh

బాబు.. మళ్లీ ఎన్డీఏలో ఎందుకు చేరుతున్నావు - కేశినాని నాని ప్రశ్నల వర్షం

చంద్రబాబుకు బీజేపీ, మోడీ అమిత్ షాల నుంచి ఎలాంటి హామీ లభించిందో క్లారిటీ ఇవ్వాలన్నారు కేశినేని నాని. అధికారంలో ఉన్ననాడు మోడీని ఎందుకు వ్యతిరేకించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

బాబు.. మళ్లీ ఎన్డీఏలో ఎందుకు చేరుతున్నావు - కేశినాని నాని ప్రశ్నల వర్షం
X

టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరతున్నారన్న వార్తలపై స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఈ అంశంపై చంద్రబాబుకు వరుస ప్రశ్నలు సంధించారు. గతంలో ఎన్డీఏను ఎందుకు వీడారో.. మళ్లీ ఇప్పుడు ఎన్డీఏలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అప్పటికి, ఇప్పటికీ ఎన్డీఏలో ఏం మార్పు వచ్చిందో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు నాని. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు. విభజన హామీలన్ని అమలు చేస్తామని చెప్పారా అని అడిగారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ రూ.లక్ష కోట్లు ఇస్తానన్నారా సమాధానం చెప్పాలని బాబుకు సవాల్ చేశారు కేశినేని నాని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని మోడీ హామీ ఇచ్చారా లేదా విశాఖ రైల్వే జోన్ చేస్తామని హామీ ఇచ్చారో చెప్పాలన్నారు.

చంద్రబాబుకు బీజేపీ, మోడీ అమిత్ షాల నుంచి ఎలాంటి హామీ లభించిందో క్లారిటీ ఇవ్వాలన్నారు కేశినేని నాని. అధికారంలో ఉన్ననాడు మోడీని ఎందుకు వ్యతిరేకించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం అమిత్ షాతో చంద్రబాబు, పవన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమతో కలిసి రావాలని బీజేపీని ప్రాధేయపడుతున్నారు చంద్రబాబు.

First Published:  8 March 2024 12:01 PM GMT
Next Story