Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకే సవాలు విసిరిన కేఈ

చంద్రబాబు ప్రకటించిన అభ్యర్ధి సుబ్బారెడ్డిని తాను ఆమోదించేది లేదని ప్రకటించారు. సుబ్బారెడ్డిని అభ్యర్ధిగా తాను గుర్తించేది లేదని వెంటనే అభ్యర్ధిని మార్చాల్సిందే అంటూ చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇచ్చారు.

చంద్రబాబుకే సవాలు విసిరిన కేఈ
X

కర్నూలు జిల్లా డోన్ మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకే సవాలు విసిరారు. చంద్రబాబును ఉద్దేశించి కేఈ చేసిన సవాలు జిల్లాలో సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో ధర్మవరం సుబ్బారెడ్డి అనే నేతను చంద్రబాబు అభ్యర్ధిగా ప్రకటించారు. సుబ్బారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించినా ఆయన నియోజకవర్గంలో స్వేచ్చగా కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో పూర్తి ఆధిపత్యం కేఈ ప్రభాకర్ చేతిలో ఉంది.

కేఈని కాదని చంద్రబాబు కొత్త అభ్యర్ధిని ప్రకటించటంతో పార్టీ నేతల్లో చాలామంది సుబ్బారెడ్డికి సహకరించటం లేదు. ఈ విషయం జిల్లాలో అందరికీ తెలుసు. తాజాగా కేఈ పుట్టినరోజు సందర్భంగా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్ధి సుబ్బారెడ్డిని తాను ఆమోదించేది లేదని ప్రకటించారు. సుబ్బారెడ్డిని అభ్యర్ధిగా తాను గుర్తించేది లేదని వెంటనే అభ్యర్ధిని మార్చాల్సిందే అంటూ చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇచ్చారు.

ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా సుబ్బారెడ్డి స్ధానంలో డోన్‌లో పోటీచేయబోయేది తానే అని కూడా మద్దతుదారులకు చెప్పారు. తనను కాదని సుబ్బారెడ్డినే పోటీ చేయించాలని చంద్రబాబు అనుకుంటే కచ్చితంగా ఓడగొడతానని వార్నింగ్ ఇవ్వటం కలకలం రేపుతోంది. ఆర్ధిక, అంగ బలమున్న తమను కాదని చంద్రబాబు ఇంకెవరినో అభ్యర్ధిగా ప్రకటిస్తే తాము చూస్తు ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంటుగా అయినా పోటీ చేయటం ఖాయమన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

మొత్తానికి డోన్లో చంద్రబాబు చేసిన ప్రయత్నం చివరకు ఇలా తయారైంది. అభ్యర్ధులను ముందుగా ప్రకటించటం మంచిదే అయినా నియోజకవర్గంలో ఉన్న సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడి లేదా వాళ్ళని కన్వీన్స్ చేసి ప్రకటిస్తే బాగుండేది. మరి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఆధారంగా చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటిస్తున్నారో అర్ధం కావటంలేదు. ఈ నేపథ్యంలోనే డోన్‌లో కేఈ కుటుంబాన్ని వాళ్ళ మద్దతుదారులను కాదని సుబ్బారెడ్డి గెలుస్తారని చంద్రబాబు ఎలాగ అనుకున్నారో ఆయనకే తెలియాలి.

First Published:  24 Nov 2022 5:54 AM GMT
Next Story