Telugu Global
Andhra Pradesh

ఏపీ బరిలోకి గులాబీ దళం..!

వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అసెంబ్లీ స్థానాల కంటే లోక్‌సభ స్థానాలపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ బరిలోకి గులాబీ దళం..!
X

పక్క రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న గులాబీ దళం, ఇప్పుడు ఏపీపై ఫోకస్‌ పెంచింది. సార్వత్రిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒకరూపంలో కేంద్రంలోని బీజేపీని సమర్థిస్తున్న పార్టీలే. ఇక కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఏపీలోకి ఎంటర్‌ అవ్వాలనుకుంటోంది బీఆర్‌ఎస్‌. వచ్చే లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారట.

ఓవైపు ప్రతిపక్షాల ఉమ్మడి వేదిక బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పోటీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. బీజేపీతో పాటు కాంగ్రెస్‌తోనూ కలిసి వెళ్లడానికి సిద్ధంగా లేని కేసీఆర్‌ ప్రతిపక్షాలతో జట్టుకట్టేందుకు ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేయాలనుకుంటోందట.

మహారాష్ట్ర పర్యటన ముగించుకు వచ్చిన వెంటనే కేసీఆర్‌ పార్టీ కీలక నేతల‌తో సమావేశమై ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో ప్రజలు విసిగివేసారిపోయారని, ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని కేసీఆర్‌ చెప్పారట. తెలంగాణ పథకాల పట్ల మహారాష్ట్ర ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారని, మనం ఫోకస్‌ పెడితే మంచి ఫలితాలుంటాయని చెప్పారట. సార్వత్రిక ఎన్నికల నాటికి పక్క రాష్ట్రాల్లో బలోపేతం అవ్వడం ద్వారా మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకునే అవ‌కాశముంటుందని కేసీఆర్‌ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అసెంబ్లీ స్థానాల కంటే లోక్‌సభ స్థానాలపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు, విభజన హామీలు, రాజధాని, పోలవరం లాంటి అంశాలను ఎన్నికల అస్త్రాలుగా ప్రయోగించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోందట. ఏపీలో ప్రధాన పార్టీలన్నీ కేంద్రానికి అనుకూలంగా ఉన్నవే కావడంతో వ్యతిరేక ఓటుపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ చేయాలనుకుంటోందట.

ఇప్పటికే అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ సమస్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కు, విభజన హామీలు, రాజధాని సమస్యలను పరిష్కరిస్తామనే హామీతో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటోంది బీఆర్‌ఎస్‌. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోపే కేసీఆర్‌ ఏపీలో పర్యటించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య మొదటి సభకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. వరుసగా ఏపీలోని అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్‌ సభల కోసం ఇప్పటికే ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏపీ ప్రజల ముందు బీఆర్‌ఎస్‌ భారీ హామీలు కురిపించే అవకాశం లేకపోలేదు.

First Published:  30 Jun 2023 5:52 AM GMT
Next Story