Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేకి మొండిచెయ్యి తప్పదా?

రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద వివిధ కారణాలతో పార్టీ నేతల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయి దూరంగా ఉంటున్నారు. రామిరెడ్డికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు తక్కువని సర్వేలో తేలిందట. ఇదే సమయంలో బీద సిఫారసు కారణంగా చిన మస్తానమ్మకు టికెట్ విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నారట.

ఎమ్మెల్యేకి మొండిచెయ్యి తప్పదా?
X

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యేకి టికెట్ దక్కే అవకాశం దాదాపు లేదని సమాచారం. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలి నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలిచిన రామిరెడ్డి మీద జనాల్లో వ్యతిరేకత మొదలైపోయినట్లు సమాచారం. మామూలు జనాల్లోనే కాదు పార్టీ నేతల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోందట. ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలు, ఇసుక కాంట్రాక్టులతో పాటు ఇతరత్రా కార్యక్రమాలతో చెడ్డపేరు తెచ్చుకున్నారట.

ఇలాంటి అనేక కారణాల వల్ల రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని పోటీ చేయిస్తే ఎలాగుంటుందని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ కొత్త అభ్యర్థి ఎవరంటే డాక్టర్ చిన మస్తానమ్మ పేరు బాగా వినబడుతోంది. ఈ డాక్టర్ ఒక‌ప్పుడు గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ చైర్‌పర్సన్ గా పనిచేశారు. బీసీ అందులోనూ యాదవ సామాజికవర్గానికి చెందిన మస్తానమ్మకు వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు స్వయాన సోదరుడు అవుతారు. బీద దన్నుతోనే ఈమె రెగ్యులర్‌గా కావలి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని సమాచారం.

కావలిలో మొదటి నుండి బీసీల జనాభా అందులోనూ యాదవులు ఎక్కువగా ఉన్నారు. ఈ కారణంతోనే మస్తాన్ రావు 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో తక్కువ తేడాతోనే ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీద టీడీపీ నుండి వైసీపీలో చేరారు. యాదవుల మద్దతు సమీకరించే బాధ్యతను బీదపై జగన్ మోపారు. ఇందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాలకు బీదను ఇన్‌చార్జిగా కూడా నియమించారు.

రామిరెడ్డి మీద వివిధ కారణాలతో పార్టీ నేతల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయి దూరంగా ఉంటున్నారు. రామిరెడ్డికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు తక్కువని సర్వేలో తేలిందట. ఇదే సమయంలో బీద సిఫారసు కారణంగా చిన మస్తానమ్మకు టికెట్ విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నారట. మస్తానమ్మకు టికెట్ ఇస్తే టీడీపీ ఓట్లు కూడా పడే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఎలాగంటే మస్తానమ్మ సోదరుడు బీద రవిచంద్రయాదవ్ టీడీపీ జాతీయ కార్యదర్శి. పార్టీలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కాబట్టి సోదరికి టికెట్ ఇస్తే రవిచంద్రను కూడా కంట్రోల్ చేయచ్చని అనుకుంటున్నారు. అన్నీ వర్క్ అవుట్ అయితే సిట్టింగ్‌కు టికెట్ గోవిందా అన్నట్లే ఉంది.

First Published:  8 March 2023 6:33 AM GMT
Next Story