Telugu Global
Andhra Pradesh

అనితక్కా, అప్పు తీర్చు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

సోషల్ మీడియాలో టీడీపీ మహిళా విభాగం నేత వంగలపూడి అనితపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. రుణం చెల్లించాలంటూ ఆమెకు కర్నాటక బ్యాంక్ ఇచ్చిన నోటీసులు వైరల్‌గా మారాయి.

అనితక్కా, అప్పు తీర్చు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
X

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా యుద్ధం ముదిరింది. పార్టీ అధినేతల కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయ వివాదాల్లోకి తీసుకొచ్చి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ, ఏ చిన్న తప్పు దొర్లినా, పొరపాటు కనపడినా సోషల్ మీడియాలో వైరి వర్గానికి బుక్కయిపోతుంటారు నాయకులు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా విభాగానికి బుక్కయ్యారు టీడీపీ మహిళా విభాగం అధినేత వంగలపూడి అనిత. బ్యాంక్ రుణం చెల్లించలేదంటూ ఆమెకు వచ్చిన నోటీసులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రూ.82 లక్షలు రుణం తీసుకుని చెల్లించని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు కర్నాటక బ్యాంకు నోటీసులు జారీ చేసింది. రూ.82 లక్షలను 60 రోజుల్లో చెల్లించాలని లేదా తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఈ మేరకు బ్యాంకు ఇచ్చిన పత్రికా ప్రకటన సోషల్‌ మీడియాలోకి ఎక్కింది, వైరల్‌ అవుతోంది. దీన్ని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది.

వంగలపూడి అనిత ఇటీవల కాలంలో వైసీపీని, జగన్ కుటుంబ సభ్యుల్ని బాగానే టార్గెట్ చేస్తున్నారు. దివ్యవాణి నిష్క్రమణతో టీడీపీ మహిళా విభాగంలో అనిత మరింత కీలకం అయ్యారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. సరిగ్గా ఈ టైమ్‌లో ఆమెకు బ్యాంకు నోటీసులివ్వడం వైరి వర్గానికి అనుకోని వరంలా మారింది. అనితక్కా అప్పు తీర్చు అంటూ వారంతా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఓ రేంజ్‌లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనికి అనిత వైపు నుంచి ఇంకా కౌంటర్లు పడలేదు. ఈ నోటీస్ వ్యవహారాన్ని, ట్రోలింగ్‌ని ఆమె లైట్ తీసుకుంటారా లేక, బదులు తీర్చుకుంటారా అనేది వేచి చూడాలి.

First Published:  10 Sep 2022 6:40 AM GMT
Next Story