Telugu Global
Andhra Pradesh

జనసేనకు ఓట్లేయించటమే టార్గెట్టా..?

పనిలోపనిగా బహిరంగసభకు హాజరుకానీ కాపు ప్రజాప్రతినిధులను బాలాజీ నోటికొచ్చినట్లు తిట్టడం ఆశ్చర్యంగా ఉంది. వచ్చేఎన్నికల్లో కాపుల ఓట్లు కావాలని ప్రచారానికి వచ్చిన కాపు అభ్యర్ధులను.. కొట్టాలని పిలుపునివ్వటం వివాదాస్పదమైంది.

జనసేనకు ఓట్లేయించటమే టార్గెట్టా..?
X

పేరుకే విశాఖపట్నంలో జరిగిన కాపునాడు సమావేశం పార్టీలకు అతీతం. కానీ, వక్తల్లో అత్యధికులు మాట్లాడింది మాత్రం జనసేనను రక్షించుకోవాలని, పవన్ కల్యాణ్ ను బలపరచాలనే. కాపుల కోసం అప్పుడెప్పుడో వంగవీటి రంగా నిలిచారని, తర్వాత వచ్చిన మరో వ్యక్తి (చిరంజీవి) ఎక్కువ కాలం నిలబడలేకపోయారని వక్తలు చెప్పారు. ఇప్పుడు కాపుల కోసం వచ్చిన మూడో వ్యక్తిని (పవన్) కాపాడుకోలేకపోతే జాతి మనుగడే కష్టమని వక్తలు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.

వక్తలు మాట్లాడింది ఎలాగుందంటే.. చిరంజీవి లేదా పవన్ కల్యాణ్ తోనే కాపుల మనుగడ ఆధారపడుందని చెప్పటం. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే మాట్లాడిన వాళ్ళెవరు కూడా డైరెక్టుగా పవన్ కు ఓట్లేయాలని, జనసేనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పలేదు. చివరకు సభ నిర్వహణలో కీలకమైన గాదె బాలాజీ కూడా జనసేనకు ఓట్లేసి పవన్ను సీఎం చేయాలని చెప్పలేదు. అయితే మాట్లాడిన ప్రతి ఒక్కరూ జనసేనకు ఓట్లేయాలని పరోక్షంగా చెప్పారు.

పనిలోపనిగా బహిరంగసభకు హాజరుకానీ కాపు ప్రజాప్రతినిధులను బాలాజీ నోటికొచ్చినట్లు తిట్టడం ఆశ్చర్యంగా ఉంది. వచ్చేఎన్నికల్లో కాపుల ఓట్లు కావాలని ప్రచారానికి వచ్చిన కాపు అభ్యర్ధులను.. కొట్టాలని పిలుపునివ్వటం వివాదాస్పదమైంది. బహిరంగ సభకు హాజరుకానీ కాపు ప్రముఖులను బాలాజీ పిరికివాళ్ళుగా వర్ణించారు. వైసీపీ, టీడీపీల్లోని కాపులంటే హాజరుకాలేదు బాగానే ఉంది. మరి పోస్టర్లో ఫొటోలు ముద్రించినందుకైనా చిరంజీవి, పవన్ హాజరుకావాలి కదా..? మరెందుకని వాళ్ళు కూడా హాజరుకాలేదు..?

బాలాజీ తిట్టిన తిట్లు కాపు ప్రజాప్రతినిధులకు వర్తించినట్లే చిరంజీవి, పవన్ కు కూడా వర్తిస్తుందా..? కాపు సంఘంలోని ప్రముఖల మధ్య జరుగుతున్న టాక్ ఏమిటంటే.. వైజాగ్ సభ అచ్చంగా జనసేనకు మద్దతుగా పెట్టిన సభే. కాకపోతే ఆ విషయాన్ని డైరెక్టుగా చెప్పటంలో వక్తలు, నిర్వాహకులు ఎందుకనో భయపడ్డారు. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కారణంగానే కాపు ప్రజాప్రతినిదులు, కాపు ప్రముఖులు బహిరంగసభకు హాజరుకాలేదు.

First Published:  27 Dec 2022 5:20 AM GMT
Next Story