Telugu Global
Andhra Pradesh

కాపులు మూడు వర్గాలుగా చీలిపోయారా?

తాజాగా కాపు సమాజంలో స్పష్టమైన చీలికలు వచ్చినట్లు అర్ధమైపోతోంది. గతంలో కూడా కాపులు ఏకతాటిపైన ఎప్పుడూ లేరు. ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లసుకునేవారు. రాజకీయంగా ఎదగటానికి ఇదే కాపులకు పెద్ద సమస్యగా మారిపోయింది.

కాపులు మూడు వర్గాలుగా చీలిపోయారా?
X

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కులాల గొడవలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా కాపు సమాజంలో స్పష్టమైన చీలికలు వచ్చినట్లు అర్ధమైపోతోంది. గతంలో కూడా కాపులు ఏకతాటిపైన ఎప్పుడూ లేరు. ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లసుకునేవారు. రాజకీయంగా ఎదగటానికి ఇదే కాపులకు పెద్ద సమస్యగా మారిపోయింది. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకురావటానికి చాలా ప్రయత్నాలే జరిగినా ఉపయోగం కనబడలేదు.

అయితే ఇప్పుడు కనబడుతున్న చీలికలాంటిది గతంలో కనబడలేదనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే కాపుల్లోని మెజారిటి ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. కొంతమంది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతిస్తున్నారు. మెజారిటి కాపులు వైసీపీ మద్దతిస్తున్నట్లు ఎలా చెబుతున్నారంటే ఐదుగురు మంత్రులు, పార్టీలో 27 మంది ఎమ్మెల్యేల‌తో పాటు కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వీరుకాకుండా మాజీలు చాలామందే ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు వైసీపీలో ఉన్నారు కాబట్టే మెజారిటి కాపులు వైసీపీతో ఉన్నారని చెబుతున్నది.

ఇదే సమయంలో టీడీపీలో కూడా ముగ్గురు కాపు ఎమ్మెల్యేల‌తో పాటు మాజీలు కూడా ఉన్నారు. నిజానికి రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంకా చాలా మంది కాపులున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకే పెద్ద సమస్య మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరికి ఓట్లేయాలో తేల్చుకోలేకపోతున్నారు. కాపులను జనసేనకు దూరం చేయటంలో భాగంగానే మొన్న రాజమండ్రిలో ప్రత్యేకంగా అధికార పార్టీలోని కాపు ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. తొందరలోనే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నారు.

ఈ విషయంలోనే జనసేనలోని కాపులు మండిపోయి తాడేపల్లిగూడెంలో పోటీ సమావేశం పెట్టుకున్నారు. వైసీపీలోని కాపులు పవన్‌ను తిడుతుంటే జనసేనలోని కాపునేతలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఏమిచేయాలో తెలీక టీడీపీలోని కాపులు చోద్యం చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుంటే రెండు పార్టీల్లోని కాపులు కలిసి జగన్‌ను టార్గెట్ చేస్తారు. అదే పొత్తు లేకపోతే అప్పుడు టీడీపీలోని కాపులు జగన్‌తో పాటు పవన్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవటం ఖాయం. మొత్తానికి గతంలో ఎప్పుడు లేనంతగా చీలికలు వచ్చాయన్నది వాస్తవం.

First Published:  6 Nov 2022 9:20 AM GMT
Next Story