Telugu Global
Andhra Pradesh

అల్లుడి పాదయాత్రకు బాలయ్య గండం?

నిజంగానే కాపు సంఘాలు గనుక పాదయాత్రను అడ్డుకుంటే గోలగోలవ్వటం ఖాయం. దాంతో లా అండ్ ఆర్డర్‌ను సాకుగా చూపించి పాదయాత్రను పోలీసులు నిలిపేసే అవకాశాలున్నాయి.

అల్లుడి పాదయాత్రకు బాలయ్య గండం?
X

నోటికెంతొస్తే అంత మాట్లాడేయటం, తన వ్యాఖ్యలపై గొడవైతే కనీసం సారీ కూడా చెప్పకపోవటం నందమూరి బాలకృష్ణ స్టైల్. గతంలో కూడా మహిళలపైన, రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్యూర్‌పైన నోటికొచ్చింది మాట్లాడారు. అయితే ఎల్లో మీడియా పూర్తి మద్దతున్న కారణంగా అప్పట్లో బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్దగా గొడవకాలేదు. కానీ తొందరలో ఎన్నికలు వస్తున్నాయి కదా ప్రతి మాట వివాదాస్పదమవుతోంది. దీంతో చంద్రబాబునాయుడికి, టీడీపీకి తలనొప్పులు తప్పటంలేదు.

ఇంతకీ విషయం ఏమింటటే ఓ సినిమా సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆ రంగారావు..ఈ రంగారావు, అక్కినేని..తొక్కినేని అంటూ చాలా ఈసడింపుగా మాట్లాడారు. బాలయ్య మాట్లాడింది ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు గురించే. తన తండ్రి ఎన్టీయార్ గొప్పోడు అని చెప్పుకోవటంలో తప్పేలేదు. కానీ తండ్రి గొప్పోడని చెప్పటం కోసం ఎస్వీ రంగారావు, అక్కినేనిని చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కనీసం ఈ ఇంగితం కూడా లేకుండానే బాలయ్య నోటికొచ్చింది మాట్లాడేశారు.

ఇప్పుడేమైందంటే ఎస్వీ రంగారావును చులకనగా మాట్లాడటంతో కాపు సంఘాలు మండిపోతున్నాయి. ఈ రోజులోపు కాపులకు బాలయ్య మీడియా సమావేశంలో క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేశాయి. పదేళ్ళ పాటు బాలయ్యను టీడీపీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. బాలయ్యకు క్షమాపణలు చెప్పేంత సంస్కారం లేదు, అలాగే బావమరిదిని బహిష్కరించేంత సీన్ చంద్రబాబుకూ లేదు. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఏమిటంటే కుప్పం నుంచి 27న మొదలయ్యే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని కూడా కాపు సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి.

నిజంగానే కాపు సంఘాలు గనుక పాదయాత్రను అడ్డుకుంటే గోలగోలవ్వటం ఖాయం. దాంతో లా అండ్ ఆర్డర్‌ను సాకుగా చూపించి పాదయాత్రను పోలీసులు నిలిపేసే అవకాశాలున్నాయి. పాదయాత్రకు పోలీసులు అనుమతించిందే మూడు రోజులు. కాపులు గనుక అడ్డుపడితే కుప్పం దాటేలోపే పాదయాత్రకు బ్రేకులు పడినా ఆశ్చర్యం లేదు. వివిధ కారణాలతో చంద్రబాబుపై కాపులు మండిపోతున్నారు. ఇప్పుడీ వివాదాన్ని అడ్డంపెట్టుకుని రాబోయే ఎన్నికల్లో కాపులు వ్యతిరేకంగా ఓట్లేస్తే టీడీపీ పుట్టిమున‌గటం ఖాయం. ఎస్వీ రంగారావును కాపులందరు తమవాడిగా ఓన్ చేసుకుంటారు. అలాంటి ఎస్వీపై బాలయ్య కామెంట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండిచకపోవటంపై కాపులంతా మండిపోతున్నారు. మొత్తానికి బావయ్యకు బాలయ్య కామెంట్లు పెద్ద తలనొప్పిగా మారబోతున్నాయనే అనిపిస్తోంది.

First Published:  25 Jan 2023 5:28 AM GMT
Next Story