Telugu Global
Andhra Pradesh

ఎస్వీ రంగారావుపై అనుచిత వ్యాఖ్యలు.. బాలకృష్ణపై కాపునాడు ఆగ్రహం

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాపునాడు స్పందించింది. ఎస్వీ రంగారావును ఉద్దేశించి ఆ రంగారావు.. ఈ రంగారావు.. అని అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

ఎస్వీ రంగారావుపై అనుచిత వ్యాఖ్యలు.. బాలకృష్ణపై కాపునాడు ఆగ్రహం
X

వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. సభలో బాలకృష్ణ మాట్లాడుతూ 'ఆ రంగారావు ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని' అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. వెంటనే అక్కినేని ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అక్కినేని నాగేశ్వరరావు మనవళ్లు నాగచైతన్య, అఖిల్ కూడా ట్విట్టర్ వేదికగా బాలకృష్ణపై పరోక్షంగా కౌంటర్ వేశారు.

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాపునాడు స్పందించింది. ఎస్వీ రంగారావును ఉద్దేశించి ఆ రంగారావు.. ఈ రంగారావు.. అని అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా బాలకృష్ణ కాపులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అ సంఘ నేతలు విమర్శించారు. రాజకీయాల్లో చిరంజీవి విఫలం అయ్యారని.. రాజకీయాల్లో విజయం సాధించడం తమకే సాధ్యమంటూ.. మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు.. అని కామెంట్స్ చేశారని గుర్తుచేశారు.

ఇప్పుడు బాలకృష్ణ ఎస్వీ రంగారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రంగారావుపై చేసిన వ్యాఖ్యలపై 25వ తేదీ సాయంత్రంలోగా బాలకృష్ణ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని కాపునాడు సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వంగవీటి రంగారావు విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే టీడీపీ బాలకృష్ణను పది సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని కాపునాడు సంఘం డిమాండ్ చేసింది. బాలకృష్ణను పార్టీ నుంచి బహిష్కరించకపోతే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

First Published:  24 Jan 2023 2:07 PM GMT
Next Story