Telugu Global
Andhra Pradesh

పవన్‌కు అందరు ఇస్తున్న సలహా ఇదేనా?

ఇదంతా చూసిన తర్వాత పవన్ అటు బీజేపీకి ఇటు టీడీపీకి కాకుండా పోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే బీసీలు, దళితులు, కాపుల కలిసుంటే రాజ్యాధికారం తథ్యమని చెప్పారు. ఇందులో ఎక్కడా బీజేపీ, టీడీపీ ప్రస్తావన తేలేదు.

పవన్‌కు అందరు ఇస్తున్న సలహా ఇదేనా?
X

జనసేన పార్టీ ఆఫీసులో శని, ఆదివారాల్లో జరిగిన సమావేశాల్లో నేతలు పవన్ కల్యాణ్‌కు వచ్చిన సలహాలు ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. శనివారం బీసీ సంక్షేమం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన వివిధ సంఘాల నేతలంతా టీడీపీ, బీజేపీని వదిలేసి తమతో చేతులు కలపాలని గట్టిగా చెప్పారు. బీజేపీ, టీడీపీలతో ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని డైరెక్టుగా పవన్‌కే చెప్పేశారు.

ఇక ఆదివారం నాడు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్యతో పాటు కొందరు ముఖ్యలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చేగొండి తదితరులు మాట్లాడుతూ టీడీపీకి దూరంగా ఉండమని పవన్‌కు సూచించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప‌వ‌న్‌ను ప్రకటించిన‌ప్పుడు మాత్రమే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవాలని గట్టిగా చెప్పారు. బీసీ, కాపు నేతలు చెప్పింది చూస్తుంటే చంద్రబాబు నాయుడుతో పవన్ కలవటం ఎవరికీ ఇష్టంలేదని అర్థ‌మైపోతోంది.

ఇక పవన్ మాట్లాడుతూ జనసేనపై టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. జనసేనకు 20 సీట్లిస్తే సరిపోతుందన్న సంకేతాలను టీడీపీ ఉద్దేశ‌పూర్వకంగానే లీకులిచ్చిందని మండిపోయారు. 20 సీట్లకు అంగీకరించేట్లుగా కాపుల ఆత్మగౌరవాన్ని తాను తగ్గించనని ప్రకటించారు. అంటే పొత్తు పెట్టుకుంటే 20 సీట్ల కన్నా ఎక్కువగానే తీసుకుంటానని పరోక్షంగా చెప్పారు. రెండు రోజుల పాటు ఇన్ని చర్చలు జరుగుతున్నా తాను బీజేపీకి మిత్రపక్షంగానే ఉంటానని పవన్ ఒక్కసారి కూడా చెప్పలేదు.

ఇదంతా చూసిన తర్వాత పవన్ అటు బీజేపీకి ఇటు టీడీపీకి కాకుండా పోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే బీసీలు, దళితులు, కాపుల కలిసుంటే రాజ్యాధికారం తథ్యమని చెప్పారు. ఇందులో ఎక్కడా బీజేపీ, టీడీపీ ప్రస్తావన తేలేదు. ఇదంతా చూస్తుంటే పవన్ అసలు ఎవరితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది.

First Published:  13 March 2023 5:42 AM GMT
Next Story