Telugu Global
Andhra Pradesh

మహిళా యూనివర్శిటీలో పాల్ హ‌ల్‌చ‌ల్‌.. అరెస్ట్..

సహజంగా రాజకీయ నాయకులు ముందుగా పర్మిషన్ తీసుకుని విద్యార్థులతో మాట్లాడతారు. కానీ పాల్ నేరుగా కార్లు లోపలికి పోనిచ్చారు. హాస్టల్ వద్ద ఓ విద్యార్థిని ఆరోగ్యం బాగవడానికంటూ ప్రార్థన చేసి హడావిడి చేశారు.

మహిళా యూనివర్శిటీలో పాల్ హ‌ల్‌చ‌ల్‌.. అరెస్ట్..
X

రండి రండి నాతో సెల్ఫీలు దిగండి, మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడించండి.. ఇదీ పద్మావతి యూనివర్శిటీలో కేఏ.పాల్ హడావిడి. ఎలాంటి అనుమతి లేకుండా నేరుగా యూనివర్శిటీ క్యాంపస్ లోకి తన కార్లలో, మందీ మార్బలంతో దూసుకు రావడమే కాకుండా.. లోపల విద్యార్థినులను పిలిచి మాట్లాడటం, రోడ్డుపైనే వారితో మాట్లాడుతూ సెల్ఫీలు దిగడంతో సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతి పర్యటనలో కేఏ.పాల్ హడావిడి మామూలుగా లేదు. మంగళవారం మధ్యాహ్నం ప్రెస్మీట్ లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ని చెడామడా తిట్టేసి రెండు రాష్ట్రాల్లో అధికారం తనదేనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సడన్ గా పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇచ్చారు. సహజంగా రాజకీయ నాయకులు ముందుగా పర్మిషన్ తీసుకుని విద్యార్థులతో మాట్లాడతారు. కానీ పాల్ నేరుగా కార్లు లోపలికి పోనిచ్చారు. హాస్టల్ వద్ద ఓ విద్యార్థిని ఆరోగ్యం బాగవడానికంటూ ప్రార్థన చేసి హడావిడి చేశారు. ఆ తర్వాత విద్యార్థినులతో సెల్ఫీలు దిగారు.

అనుమతి లేకుండా యూనివర్శిటీ హాస్టల్ వద్దకు రావడంతో సిబ్బంది వారించారు, కానీ ఆయన మాట వినలేదు, యూనివర్శిటీలో మతపరమైన ప్రార్థనలు చేయడం సరికాదని చెప్పినా కూడా ఆయన లెక్కచేయలేదు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్శిటీ హాస్టల్ వద్దే కేఏ.పాల్ ను వాహనంలోనే పోలీసులు నిర్బంధించారు. ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. చివరకు మీడియాపైనా చిందులు తొక్కారు పాల్.

హడావిడి చేయాలి, హైలైట్ కావాలి..

ఆమధ్య తెలంగాణలో తనపై దాడి జరిగిందంటూ.. ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షా ని కలసి పెద్ద సీన్ క్రియేట్ చేశారు పాల్. ఇటు ఏపీలో పర్యటిస్తున్నా ఆయన్ని ఎవరూ లెక్కచేయడంలేదు. దీంతో ఏదో ఒకటి చేసి హైలైట్ కావాలనే ప్లాన్ తో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పాల్. వింత చేష్టలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. మహిళా యూనివర్శిటీలో ప్రార్థనలు, సెల్ఫీలు, పేరెంట్స్ కి ఫోన్లు చేసి ఓవర్ యాక్షన్ చేయడం.. ఇలా నానా యాగీ చేసి చివరకు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు పాల్.

First Published:  3 Aug 2022 2:25 AM GMT
Next Story