Telugu Global
Andhra Pradesh

సంక్రాంతికి ఏపీలో పాల్ కామెడీ.. ఇంతకీ ఏమన్నారంటే..?

తాను అధికారంలోకి వస్తే, 6 నెలల్లోనే ఏపీ అప్పులు తీర్చి, లక్ష ఉద్యోగాలు తెస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు తన పాస్ పోర్టు, గ్రీన్ కార్డ్ కోర్టులో సబ్మిట్ చేస్తానని హామీ ఇచ్చారు.

సంక్రాంతికి ఏపీలో పాల్ కామెడీ.. ఇంతకీ ఏమన్నారంటే..?
X

ఆమధ్య కందుకూరు ఘటన తర్వాత చంద్రబాబుని అరెస్ట్ చేయాలని, అమెరికాలో అయితే జైలులో వేసేవారని మీడియా ముందుకొచ్చి హడావిడి చేసిన కేఏ పాల్.. తాజాగా సంక్రాంతికి నవ్వులు పూయించారు. సంక్రాంతి సందర్భంగా అనంతపురం వచ్చిన ఆయన చంద్రబాబు, జగన్, పవన్ పై మండిపడ్డారు. చంద్రబాబు, జగన్ ఏపీని అప్పులపాలు చేశారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే, 6 నెలల్లోనే ఏపీ అప్పులు తీర్చి, లక్ష ఉద్యోగాలు తెస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు తన పాస్ పోర్టు, గ్రీన్ కార్డ్ కోర్టులో సబ్మిట్ చేస్తానని హామీ ఇచ్చారు.

ఆ జీఓ ఎంత మంచిదంటే..?

జీఓ నెంబర్-1 ప్రజల మంచికోరేది అని అన్నారు కేఏపాల్. ఆ జీఓని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. సందుల్లో, గొందుల్లో మీటింగ్‌ లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఒకవేళ వైసీపీ నేతలు సందుల్లో సభలు పెట్టినా తాను అడ్డుకుంటానని హెచ్చరించారు. జీఓ నెంబర్-1 ని సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు పాల్. అది ప్రాణాలు కాపాడే జీఓ అని పేర్కొన్నారు. జీఓ సస్పెండ్ చేసింది న్యాయమూర్తి అయినా సరే తాను తప్పుబడుతున్నానన్నారు. ఆ జీఓ మూడేళ్ల క్రితమే రావాల్సిందని, కానీ ఆలస్యమైందని చెప్పారు.

పవన్ కి మరో ఆఫర్..

పవన్ కల్యాణ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని, ఒకవేళ ఆయన నిజంగానే రాజకీయాలు చేయాలనుకుంటే, ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఓట్లు చీలుస్తున్నారని మండిపడ్డారు. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది 100 రూపాయలు కూడా లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు పాల్. పండగ వేళ కొత్తబట్టలు కూడా కొనలేని పరిస్థితుల్లో పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  15 Jan 2023 4:21 PM GMT
Next Story