Telugu Global
Andhra Pradesh

కొనేస్త చూడు.. నే కొనేస్త చూడు

రెండు వారాల్లో 4వేల కోట్లిస్తా, విశాఖ ఉక్కుని 42వేల కోట్లకు కొనేస్తానంటూ ఇప్పుడు పాల్ శపథాలు చేస్తున్నారు. ఆయన మాటలు నమ్మశక్యం కాకపోయినా, మీడియా కూడా లేనిపోని హైప్ ఇచ్చి పాల్ ని హైలెట్ చేస్తోంది.

కొనేస్త చూడు.. నే కొనేస్త చూడు
X

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం" కాస్తా.. ఇప్పుడు కేఏ పాల్ కామెడీగా మారిపోయింది. రాజకీయ పార్టీలన్నీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్నా, కేంద్రం తన పని తాను చేసుకు పోతోంది. 29 సంస్థలు బిడ్డింగ్ కి వచ్చాయి, వాటిలో ఎవరిపట్ల కేంద్రం ఆసక్తి కనబరుస్తుందో తేలాల్సి ఉంది. ఈ దశలో కేఏ పాల్ ఎంట్రీ ఈ ఎపిసోడ్ ని పూర్తి కామెడీగా మార్చేసింది. బౌన్సర్లను వెనకపెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి పాల్ మరింత రచ్చ చేస్తున్నారు. పాల్ తో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలవడంతో కలకలం రేగింది. తాజాగా ఉక్కు కర్మాగారాన్ని తానే కొనుగోలు చేస్తానని, 42వేల కోట్ల రూపాయలకు బిడ్డింగ్ వేస్తానంటూ పాల్ ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది.

కేఏపాల్ ఘన చరిత్ర అంతా గతం. ఇప్పుడాయన మాటలకు, చేతలకు పొంతన ఉండటంలేదు. అప్పటికప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం ఆయనకు అలవాటుగా మారింది. మరీ మాటలు కోటలు దాటేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. ఆమధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో ఉంగరాల రాంబాబుగా ఆయన పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత సడన్ గా మాయమై మళ్లీ ఉక్కు ఉద్యమానికి వెన్నెముక నేనేనంటూ వచ్చేశారు. విశాఖ కేంద్రంగా జబర్దస్త్ ఎపిసోడ్ లు వదులుతున్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటి వరకూ రాజకీయ పోరాటాలు జరిగాయి, ఉద్యమాలు నడుస్తున్నాయి, బిడ్డింగ్ విషయంలో బీఆర్ఎస్ చొరవతో ఏపీ, తెలంగాణ నాయకుల మధ్య మాటల యుద్దం కూడా జరిగింది. అయితే సడన్ గా కేఏపాల్ ఎంట్రీతో అసలు వ్యవహారమే మారిపోయింది. సీరియస్ గా సాగుతున్న వ్యవహారాన్ని కాస్తా కామెడీగా మార్చేశారు పాల్. పాల్ ని కలిసి లక్ష్మీనారాయణ మరింత హైప్ ఇచ్చారు. రెండు వారాల్లో 4వేల కోట్లిస్తా, విశాఖ ఉక్కుని 42వేల కోట్లకు కొనేస్తానంటూ ఇప్పుడు పాల్ శపథాలు చేస్తున్నారు. ఆయన మాటలు నమ్మశక్యం కాకపోయినా, మీడియా కూడా లేనిపోని హైప్ ఇచ్చి పాల్ ని హైలెట్ చేస్తోంది.

First Published:  23 April 2023 5:39 AM GMT
Next Story