Telugu Global
Andhra Pradesh

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై టీడీపీది దుష్ప్రచారం

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై టీడీపీది దుష్ప్రచారం
X

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య మండిపడ్డారు. భూ వివాదాలపై ప్ర‌స్తుతం ఎన్నో కేసులు నమోదవుతున్నాయని, అటువంటి వాటికి చెక్‌ పెట్టేందుకే దాదాపు వందేళ్ల తర్వాత భూ రీసర్వే చేయించడంతో పాటు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ప్రవేశపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. దానిని చంద్రబాబు వక్రీకరించి ఎల్లో మీడియా ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టంతో పేదలకు మంచి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి చెందకపోగా అంతర్యుద్ధానికి కారణమవుతున్న మోడీతో బాబు, పవన్‌ జతకట్టడం శోచనీయమని జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారు. అనంతపురంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బడుగులకు ఆత్మగౌరవం జగన్‌తోనే సాధ్యం

బడుగుల అభివృద్ధికి విద్యే ప్రధానమన్న నారాయణగురు, పూలే, అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేశారని జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారు. బడుగు, బలహీనవర్గాల వారిని ఉన్నత స్థితికి చేర్చేందుకు విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చారని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పేదలపై ఆర్థిక భారం పడకుండా అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలన్నా.. సామాజిక న్యాయం కొనసాగాలన్నా.. పేద పిల్లల జీవితాలు బాగుపడాలన్నా.. కూలీనాలీ పనులకు వెళ్లకుండా బడిబాట పట్టాలన్నా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ కలిసికట్టుగా వైసీపీకి ఓటు వేసి గెలిపించుకోవాలని జస్టిస్‌ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు, మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేశ్‌ రాష్ట్రాన్ని దోచేశారని ఆయన చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు బాబు వందల హామీలు ఇచ్చినా ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని ఆయన చెప్పారు.

First Published:  8 May 2024 5:16 AM GMT
Next Story