Telugu Global
Andhra Pradesh

కోర్టుకు రండి.. సీఎం అదనపు కార్యదర్శికి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశం

మరో కేసులో ఏపీ సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజును కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా జస్టిస్ బట్టు దేవానంద్‌ బుధవారం ఆదేశించారు.

కోర్టుకు రండి.. సీఎం అదనపు కార్యదర్శికి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశం
X

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏపీ హైకోర్టులోని టీడీపీ న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జస్టిస్ బట్టు బదిలీ వెనుక జగన్‌ హస్తముందని కూడా కొందరు ఆరోపించారు. ఎక్కువ మంది అధికారులను కోర్టుకు పిలిపించింది జస్టిస్ బట్టు దేవానందేనని అందుకే ఆయన్ను ప్రభుత్వం టార్గెట్ చేసిందంటూ కొందరు మీడియా ముఖంగానే విమర్శలు చేశారు. బట్టు దేవానంద్ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్న భావనను వారే కలిగించారు.

ఈ నేపథ్యంలో మరో కేసులో ఏపీ సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజును కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా జస్టిస్ బట్టు దేవానంద్‌ బుధవారం ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో స్కూల్ స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారంటూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు... స్కూల్ స్థలం చుట్టూ కంచె వేయాల్సిందిగా అప్పటి కలెక్టర్ ముత్యాలరాజును ఆదేశించింది.

అయితే కోర్టు ఉత్తర్వులు అమలు కాలేదంటూ పిటిషన్‌ మరోసారి కోర్టుకు వెళ్లారు. దాంతో ముత్యాలరాజు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఆయన్ను కోర్టుకు హాజరుకావాల్సిందిగా జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 29కి కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ బట్టు దేవానంద్‌ బదిలీకి కొలిజియం సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్రపతి ఆమోదముద్ర పడాల్సి ఉంది.

First Published:  1 Dec 2022 2:26 AM GMT
Next Story