Telugu Global
Andhra Pradesh

కొత్త సీఎస్‌నూ కోర్టుకు రప్పిస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం

ఆ దిశగా ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడంతో వ్యవహారం తిరిగి కోర్టుకు చేరింది. ఈ సందర్బంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగింది నిజమేనని అంగీకరించారు.

కొత్త సీఎస్‌నూ కోర్టుకు రప్పిస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం
X

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం చేసిన సిఫార్సు వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందని విపక్ష మద్దతుదారులైన న్యాయవాదులు ఇటీవల ఆరోపిస్తున్నారు. బిల్లుల చెల్లింపు అంశాలతో పాటు వివిధ కేసుల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులను జస్టిస్ బట్టు దేవానంద్ కోర్టుకు రప్పించారని.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే ఆయన బదిలీకి ఒత్తిడి తెచ్చారంటూ కొందరు న్యాయవాదులు ఏకంగా మీడియా ముందే ఆరోపించారు.

జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీకి కొలిజియం సిఫార్సు చేసినప్పటికీ ఇంకా రాష్ట్రపతి ఆమోదముద్ర పడాల్సి ఉంది. దేవానంద్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా ఏపీ సీఎస్ జవహర్‌ రెడ్డిని కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సిందిగా జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో పలుచోట్ల స్కూల్‌ ఆవరణలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను గతంలో విచారించిన కోర్టు వాటిని తక్షణం తొలగించాలని ఆదేశించింది.

ఆ దిశగా ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడంతో వ్యవహారం తిరిగి కోర్టుకు చేరింది. ఈ సందర్బంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగింది నిజమేనని అంగీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 239 పాఠశాల ఆవరణలో సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణం మొదలుపెట్టింది నిజమేనని అంగీకరించారు. కొన్ని చోట్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయని.. మరికొన్ని చోట్ల పనులు మధ్యలో ఉన్నాయన్నారు. నిర్మాణాలు పూర్తి అయితే వాటిని పాఠశాల అవసరం కోసమైనా వాడుకోవచ్చన్న ఉద్దేశంతో మధ్యలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్టు చెప్పారు.

ఈ వాదనకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఏకీభవించలేదు. పాఠశాల వాతావరణం దెబ్బతినకూడదనే 2020 జూన్‌లోనే తాము ఆదేశాలు ఇచ్చామని.. వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగించడం అంటే కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని అభిప్రాయపడ్డారు. కోర్టు చెప్పిన తర్వాత కూడా జరిగిన నిర్మాణాలు అక్రమం కిందకే వస్తాయని.. ఆ అక్రమ నిర్మాణాలకు బిల్లుల చెల్లింపు కూడా చట్టవిరుద్దమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు బిల్లులు చెల్లించడానికి వీల్లేదని.. ఆ సొమ్మును బాధ్యులైన అధికారుల నుంచే వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ఈనెల 22న హైకోర్టుకు హాజరుకావాలని బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.

First Published:  15 Dec 2022 3:45 AM GMT
Next Story