Telugu Global
Andhra Pradesh

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమే.. ప్రచారం చేస్తాడన్నది పుకారే!

2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేయలేదు. తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత చంద్రబాబును కలిసిన సందర్భాలు కూడా లేవు.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమే.. ప్రచారం చేస్తాడన్నది పుకారే!
X

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని టీడీపీ ఎదుర్కుంటోంది. ఏపీలో అధికార వైసీపీ బలం ముందు టీడీపీ ఏ మాత్రం నిలబడలేక పోతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడ సాగించడం కష్టమని చంద్రబాబే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారంటే టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో గెలుపు కోసం చంద్రబాబు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో జట్టు కట్టాలని బాబు భావిస్తున్నారు. బీజేపీ-జనసేనతో పొత్తు ఉంటే పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అని బాబు అంచనా వేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉన్నా.. టీడీపీకి ఇప్పుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అవసరం ఉన్నది. చంద్రబాబు ప్రసంగాలు ఎప్పుడూ మూస ధోరణిలో ఉంటాయి. ఇక నారా లోకేశ్ ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడటం అనేది కష్టమే. అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించితే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల గుంటూరు పర్యటనకు వచ్చిన నందమూరి తారకరత్న కూడా వచ్చే ఎన్నికల్లో జూనియర్ ప్రచారానికి వస్తారని చెప్పారు. దీంతో నందమూరి, టీడీపీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ, వాస్తవానికి జూనియర్ ప్రచారానికి వస్తాడా? అంటే కచ్చితంగా రాడనే సమాధానమే వస్తోంది.

తాతయ్య స్థాపించిన పార్టీ కాబట్టి జూనియర్‌కు టీడీపీ అంటే తన సొంతం అని భావిస్తారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 20009లో ఏపీ అంతటా తిరిగి ఉత్సాహంగా ప్రచారం చేశారు. పాతికేళ్ల వయసులో, ఉడుకు రక్తంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు పూర్తిగా వాడేశారు. ఆనాడు సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ ప్రమాదానికి కూడా గురయ్యారు. కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు తిరిగి ఎన్టీఆర్ వైపు చూడలేదు. పని ముగిసిన తర్వాత జూనియర్‌ను పట్టించుకోవడం మానేశారు. దీంతో అప్పుడే తారక్ తీవ్ర అసంతృప్తికి గురయినట్లు వార్తలు వచ్చాయి. పైగా ప్రచారం కోసం తన సినిమా కెరీర్‌ను కూడా డిస్ట్రబ్ చేసుకోవాల్సి వచ్చింది.

2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేయలేదు. తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత చంద్రబాబును కలిసిన సందర్భాలు కూడా లేవు. టీడీపీ కోసం ప్రచారం చేసినా చంద్రబాబునో, లోకేశ్‌నో సీఎంను చేయడం తప్పతే.. తాను పార్టీ పరంగా సాధించేది ఏమీ ఉండదని.. అలాంటప్పుడు ప్రచారానికి పోవల్సిన అవసరం ఏముందని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తారక్ ప్రస్తుతానికి సినిమా కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టిట్టారు.

ఆర్ఆర్ఆర్ మూవీ హిట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌కు మారిపోయింది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో భారీ సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తవడానికి రెండేళ్లు పడుతుంది. సరిగ్గా ఏపీలో ఎన్నికలు జరిగే సమాయానికి ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్స్‌తో విదేశాల్లో బిజీగా ఉంటాడని సన్నిహితులు చెబుతున్నారు. వందల కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలకు బ్రేక్ ఇవ్వలేడు. ఇద్దామని అనుకున్నా.. వెళ్లి చంద్రబాబు కోసం ప్రచారం చేయాలనే ఉద్దేశం కూడా ఎన్టీఆర్‌కు లేదు. అందుకే తారకరత్న చెప్పినట్లు తారక్ ప్రచారానికి వచ్చే అవకాశమే లేదని అంటున్నారు.

జూనియర్ ప్రస్తుతానికి టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. ముఖ్యంగా రాజకీయాల జోలికి ఇప్పట్లో వెళ్లే ఉద్దేశం లేదని కూడా తెలుస్తున్నది. అద్బుతమైన సినిమా కెరీర్‌ను మరోసారి డిస్ట్రబ్ చేసుకునేందుకు కూడా జూనియర్ సిద్ధంగా లేరు.

First Published:  21 Dec 2022 4:52 AM GMT
Next Story