Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఆహ్వానానికి ఓకే చెప్పని జూ.ఎన్టీఆర్‌

ఒకవేళ తన షెడ్యూల్ మారితే అప్పుడు రావడానికి ప్రయత్నిస్తానని.. రాకపోయినా మరోలా అనుకోవద్దని చెప్పేశారు. మే 28న ఖమ్మంలో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మాత్రం హాజరువుతున్నట్టు చెప్పారు.

టీడీపీ ఆహ్వానానికి ఓకే చెప్పని జూ.ఎన్టీఆర్‌
X

ఈసారి గట్టెక్కపోతే అంతే సంగతి అని భావిస్తున్న టీడీపీ ప్ర‌స్తుతం ప్రతి ఒక్కరినీ దువ్వే పనిలోనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ మీద కూడా ఈ మధ్య దృష్టి సారించింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తా అంటూ మాట్లాడటం ద్వారా ఎన్టీఆర్ అభిమానుల్లో సానుకూలత పెంచుకునేందుకు నారా లోకేష్ ఇటీవల ప్రయత్నించారు.

దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకూ జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించే ప్రయత్నం టీడీపీ చేసింది. సోమవారం టీడీపీ నేత టీడీ జనార్దన్.. జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఈనెల 20న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. ఈ ఆహ్వానానికి జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పలేదు. ఈనెల 20న తన పుట్టిన రోజు కాబట్టి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి మాల్దీవులకు వెళ్తున్నట్టు జూ.ఎన్టీఆర్ వివరించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు చెప్పారు. కాబట్టి తాను రాలేనని జూ.ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ తన షెడ్యూల్ మారితే అప్పుడు రావడానికి ప్రయత్నిస్తానని.. రాకపోయినా మరోలా అనుకోవద్దని చెప్పేశారు. మే 28న ఖమ్మంలో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మాత్రం హాజరువుతున్నట్టు చెప్పారు.

జూ.ఎన్టీఆర్ స్పందనతో తాత శతజయంతి వేడుకలకు ఆయ‌న‌ హాజరుకారన్నది నిర్ధారణ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకొచ్చి ఆయన కూడా టీడీపీతో ఉన్నారన్న సంకేతాలు పంపాలనుకున్న టీడీపీ నాయకత్వానికి ఈ పరిణామం ప్రతికూలంగా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీ శ్రేణుల్లో చులకన చేసేందుకు పలు సందర్భాల్లో టీడీపీ పెద్దలే ప్రయత్నించిన నేపథ్యంలో.. శతజయంతి వేడుకలకు హాజరు కాకపోవడాన్ని కూడా ప్రతికూలంగా ప్రచారం చేస్తారేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  16 May 2023 4:58 AM GMT
Next Story