Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ లేనట్టే..

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం ఎప్పటికీ చంద్రబాబుకి జై కొట్టరని తేలిపోయింది. డెవిల్ సినిమాకోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

చంద్రబాబుకి నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ లేనట్టే..
X

చంద్రబాబుకి నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా..? చాలా సందర్భాల్లో ఇది చర్చనీయాంశమే. ఆమధ్య చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు.. నందమూరి ఆడపడుచుని నిండు సభలో అవమానించారంటూ కుటుంబమంతా ప్రెస్ మీట్ పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటివారు విడిగా వీడియోలు విడుదల చేశారు. ఇటీవల చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు మాత్రం ఎక్కడా ఎలాంటి సందడి లేదు. బాలకృష్ణ, రామకృష్ణ ఆయన వెంట తిరిగినా, వారే మొత్తం కుటుంబం కాదు. పురంధరేశ్వరి తాపత్రయం చూస్తున్నా.. ఆమెను నందమూరి లెక్కలో వేసుకోలేం, దగ్గుబాటి ఫ్యామిలీ కోడలిగా చూడాల్సిందే. రాగా పోగా నందమూరి ఫ్యామిలీ పేరు బలంగా చెప్పుకునేది హరికృష్ణ కుటుంబం ఒక్కటే. హరికృష్ణ తనయులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మూడో తరంలో ప్రజాభిమానం పొందారు, తాతకు తగ్గ మనవళ్లుగా సినిమాల్లో రాణిస్తున్నారు. మరి వారిద్దరి మద్దతు చంద్రబాబుకి ఉందా..? కచ్చితంగా లేదని క్లారిటీ వచ్చేసింది.

డెవిల్ సినిమాకోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఏపీ రాజకీయాల్లో మీరు ఏవైపు అని అడిగిన ప్రశ్నకు.. ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. తమ్ముడు ఎన్టీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఆయనకు చంద్రబాబు పేరు పలకడం కానీ, టీడీపీకి మద్దతిస్తున్నామని చెప్పడం కానీ ఇష్టం లేదని తేలిపోయింది. మనసులో అదే ఉంటే కచ్చితంగా బయటపడేవారు. తాత పెట్టిన పార్టీకి సపోర్ట్ ఇచ్చే విషయాన్ని కూడా ఆలోచించి చెబుతానన్నారంటే చంద్రబాబుపై వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీడీపీ వేరు, నందమూరి కుటుంబం వేరు..

ఇప్పుడున్న టీడీపీ నందమూరి టీడీపీ కాదు, నారావారి టీడీపీ అని కొడాలి నాని వంటి నేతలు పదే పదే గుర్తు చేస్తుంటారు. నారావారి చేతుల్లో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని పునర్వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కి పగ్గాలు అప్పగించాలని కూడా కొందరు సలహాలిస్తుంటారు. ఓ దశలో పార్టీలో కూడా ఇలాంటి భిన్నస్వరాలు వినిపించినా చంద్రబాబు ఎక్కడికక్కడ వాటిని అణచివేశారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ప్రచారానికి వాడుకుని వదిలేసి తీవ్రంగా అవమానించారు. అప్పటినుంచి నారావారి కుయుక్తులు నందమూరి వారు ఓ కంట కనిపెడుతున్నారు. బాలకృష్ణ కేవలం బావమరిదే కాదు, వియ్యంకుడు కూడా కావడంతో ఆయనకు బావ భజన తప్పడంలేదు. మిగతా వారు మాత్రం చంద్రబాబుని పూర్తిగా లైట్ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. మాత్రం ఎప్పటికీ చంద్రబాబుకి జై కొట్టరని తేలిపోయింది.

First Published:  27 Dec 2023 1:55 AM GMT
Next Story