Telugu Global
Andhra Pradesh

తెలంగాణ అయిపోయింది.. ఇక ఏపీ నుంచి జేపీ రాజకీయం!

2016లో లోక్‌సత్తా పార్టీతో పాటు తాను కూడా కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని జేపీ ప్రకటించారు. ఆ తర్వాత టీవీ డిబేట్లు, ఇతర వేదికల్లో పెద్దగా కనిపించని జేపీ.. ఇటీవల మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టీవ్ అయ్యారు.

తెలంగాణ అయిపోయింది.. ఇక ఏపీ నుంచి జేపీ రాజకీయం!
X

లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. జయప్రకాశ్ నారాయణ ఇక ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని ఏదో ఒక లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు లోక్‌సత్తా పార్టీ ఏపీ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించేందుకు తాను లోక్‌సభలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని జేపీ భావిస్తున్నారు. తెలంగాణలో తనకు ఆదరణ ఉండదని జేపీ ఓ అంచనాకు వచ్చారు. దీంతో తట్టాబుట్టా సర్థుకొని ఏపీకి పయనం అయ్యారు. విజయవాడలో జరిగిన లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయించి.. ఏపీలో కేంద్రంగా రాజకీయాలు చేసేందుకు జేపీ సిద్దమయ్యారు.

1996 నుంచే లోక్‌సత్తా ఉద్యమాన్ని ప్రారంభించిన జయప్రకాశ్ నారాయణ 2006లో దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2009లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్‌లో మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన జేపీ.. నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 9.77 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో లోక్‌సత్తా పార్టీకి ఆదరణ లేకుండా పోయింది. దీంతో 2016లో లోక్‌సత్తా పార్టీతో పాటు తాను కూడా కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని జేపీ ప్రకటించారు. ఆ తర్వాత టీవీ డిబేట్లు, ఇతర వేదికల్లో పెద్దగా కనిపించని జేపీ.. ఇటీవల మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టీవ్ అయ్యారు.

తెలంగాణలో తనకు రాజకీయంగా స్పేస్ లేదని గ్రహించిన జేపీ.. ఇక ఏపీ కేంద్రంగా రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డారు. మొదటి నుంచి బీజేపీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ముద్రపడిన జేపీ.. ఇప్పుడు కచ్చితంగా అధికార వైసీపీకి వ్యతిరేకంగానే రాజకీయం చేస్తారనే చర్చ జరుగుతున్నది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాగైతే విభజన హామీలు, ప్రత్యేక హోదా అంటూ తిరుగుతున్నారో.. ఇప్పుడు జేపీ కూడా అవే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. మొదటి నుంచి సీఎం వైఎస్ జగన్‌, ఆయన సర్కారుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న జేపీ.. తనకంటూ ఓ పొలిటికల్ స్పేస్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. ఇప్పడు ఆ ప్రతిపక్ష పార్టీలతో జేపీ కూడా కలవనున్నారు. రాష్ట్ర రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, చాలా ఏళ్లు ఐఏఎస్‌గా పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధానిని నిర్ణయించుకునే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ జేపీ ఇలాంటి డొల్ల వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్నందునే.. రాజధాని ఇష్యూను తను కూడా ఓన్ చేసుకోవాలని జేపీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే అలాంటి అనాలోచిత వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతున్నది.

ఇక ఏపీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై కూడా ఆసక్తి నెలకొన్నది. అమరావతికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన జేపీ.. విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేయబోరు. గుంటూరు లేదా విజయవాడ నుంచే ఆయన తన అదృష్టానని పరీక్షించుకునే అవకాశం ఉంది. గ్రామీణ ఓటర్లకు జేపీ పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కాబట్టి అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ రెండు స్థానాలపై ఆయన ఫోకస్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ రెండూ కాకపోతే రాయలసీమలోని ఓ లోక్‌సభ నియోజకవర్గాన్ని కూడా జేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ ప్రాంతంలో టీడీపీ, బీజేపీకి సరైన అభ్యర్థులు లేని స్థానాన్ని ఉపయోగించుకుంటారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణను వదిలేసిన జేపీ ఇక ఏపీలో తన రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు.

Next Story