Telugu Global
Andhra Pradesh

జగన్ పై జేపీ పొగడ్తలు

నాడు - నేడు బాగుందంటూ ప్రశంసలు

జగన్ పై జేపీ పొగడ్తలు
X

మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ్ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం జేపీ రాజకీయాలకు దూరంగా ఉంటూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. పలుమార్లు ఆయన విమర్శలు కూడా గుప్పిస్తుంటారు. విధానపరమైన అంశాలను విబేధిస్తుంటారు కూడా.. ఇదిలా ఉంటే తాజాగా ఆయన విశాఖలో 'అందరికీ ఆరోగ్యం' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

'సీఎం జగన్ నాడు - నేడు అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఆయన ఆలోచన చాలా గొప్పది. రాష్ట్రంలో ఈ కార్యక్రమం సమర్థంగా అమలవుతోంది. ఇప్పటికే పలు పాఠశాలల రూపురేఖలు మారాయి. విద్యారంగంలో వచ్చిన గొప్ప మార్పుగా దీన్ని నేను భావిస్తున్నాను. విద్యా ప్రమాణాలు పెంచినప్పుడే .. పేద తరగతుల నుంచి గొప్ప గొప్ప వారు తయారవుతారు.

ప్రస్తుతం కార్పొరేట్ చేతిలో ఉన్న విద్యావ్యవస్థకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయాలనుకోవడం గొప్ప ఆలోచన' అని ఆయన ప్రశంసించారు. 'ఫ్యామిలీ డాక్టర్‌' వ్యవస్థ కూడా చాలా గొప్పగా ఉంది. దీని వల్ల పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది.ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య వ్యవస్థలో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ మార్పు ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఆరోగ్యశ్రీ కింద ఏపీలో భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. అనేక వ్యాధులను ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విద్య, వైద్య వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వస్తే.. ప్రగతి పథంలో వెళ్లడం సాధ్యమవుతుంది' అంటూ జేపీ వ్యాఖ్యానించారు.

First Published:  5 Sep 2022 3:31 PM GMT
Next Story