Telugu Global
Andhra Pradesh

భిక్షాటన చేసిన జేసీ ప్రభాకర్.. గోచీ పెట్టుకుంటానని బెదిరింపు

తన డిమాండ్ ను అధికారులు గనుక పట్టించుకోకపోతే గోచీ పెట్టుకుని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తానని వార్నింగిచ్చారు. ప్రభుత్వం నిధులు విడుదలచేయని కారణంగానే తాను భిక్షాటన చేసి విరాళాలు సేకరించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు.

భిక్షాటన చేసిన జేసీ ప్రభాకర్.. గోచీ పెట్టుకుంటానని బెదిరింపు
X

చెత్తవాహనాల మరమ్మతులు తదితర డిమాండ్ల‌తో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి భిక్షాటన చేశారు. చెత్తను తీసుకెళ్ళే వాహనాలను రిపేర్లు చేయించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయ‌డంలేదంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. మొదటినుండి కూడా జేసీ రకరకాలుగా తన నిరసనను తెలియజేస్తున్నారు. చెత్త తీసుకుని వెళ్ళే వాహనాలు రిపేర్లతో మూలనపడిపోతే వాటికి రిపేర్లు చేయించే దిక్కుకూడా లేదంటూ మండిపడ్డారు.

వాహనాలకు రిపేర్లు చేయించి జనాలకు ఉపశమనం కలిగించమని ఛైర్మన్ గా తాను ఎన్నిసార్లు అధికారుల‌కు, ప్రభుత్వానికి చెప్పినా ఎవరు పట్టించుకోవటంలేదంటూ రెచ్చిపోయారు. వాహనాలు మూలపడిన కారణంగా చెత్తను తీసుకెళ్ళే అవకాశాలు లేవన్నారు. దీనివల్ల ఇళ్ళల్లోని చెత్తంతా రోడ్లపైన పేరుకుపోతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం టీడీపీ కౌన్సిలర్లు, మీడియా వాళ్ళని వెంటపెట్టుకుని షెడ్డులో ఉంచిన చెత్త వాహనాలను చూపించారు. రెండు రోజుల్లో ఈ వాహనాలకు రిపేర్లు చేయించి మళ్ళీ రోడ్లమీద తిరిగేట్లుగా చేయాలని డిమాండ్ చేశారు.

తన డిమాండ్ ను అధికారులు గనుక పట్టించుకోకపోతే గోచీ పెట్టుకుని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తానని వార్నింగిచ్చారు. ప్రభుత్వం నిధులు విడుదలచేయని కారణంగానే తాను భిక్షాటన చేసి విరాళాలు సేకరించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. అయితే జేసీని భిక్షాటన చేయనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటిలో నుండి బయటకు రానీయకుండా పోలీసులు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అందుకనే జేసీ నివాస ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. దాంతో జనాల రాకపోకలకు బాగా ఇబ్బందులయ్యాయి.

వాహనాలను రిపేర్లు చేయించేందుకు డబ్బులు కావాలనే తాను భిక్షాటన చేస్తున్నట్లు ఒక బోర్డుపై రాయించి దాన్ని మెడకు వేసుకున్నారు. మెడలో ఆ బోర్డును తగిలించుకుని కొన్ని రోడ్లపైన జేసీ తిరిగారు. కొంతసేపటికి పోలీసులు అడ్డుకోవటంతో చేసేదిలేక జేసీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఇదే తాడిపత్రి మున్సిపాలిటీకీ బెస్ట్ మున్సిపాలిటీగా అవార్డులు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

First Published:  8 Dec 2022 4:37 AM GMT
Next Story