Telugu Global
Andhra Pradesh

టీడీపీ పెద్దల వద్ద జేసీల మాట చెల్లుబాటు కావడం లేదా?

అంతిమంగా జేసీ వర్గమే క్రమశిక్షణ ఉల్లంఘిస్తోందని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ బచ్చుల అర్జునుడు తేల్చారు. ఈ పరిణామంతో పార్టీ హైకమాండ్ వద్ద జేసీ కుటుంబ పరపతిపై చర్చ జరుగుతోంది.

టీడీపీ పెద్దల వద్ద జేసీల మాట చెల్లుబాటు కావడం లేదా?
X

అనంతపురం టీడీపీలో అధిపత్య పోరు ఆగడం లేదు. టీడీపీ నాయకత్వం ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనంతపురం పట్టణంలో ఇన్‌చార్జ్ హోదాలో ప్రభాకర్ చౌదరి, మాజీ ఎంపీ హోదాలో జేసీ దివాకర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దాంతో పదేపదే ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల సొంతంగా నగరంలో జేసీ వర్గీయులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవ్వ‌గా.. తన పరిధిలో మీరెలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ ప్రభాకర్ చౌదరి అడ్డుపడ్డారు.

ఆ సమయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనపై ఇరుపక్షాలు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసుకున్నాయి. అంతిమంగా జేసీ వర్గమే క్రమశిక్షణ ఉల్లంఘిస్తోందని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ బచ్చుల అర్జునుడు తేల్చారు. జేసీ వర్గీయులుగా ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జేఎల్ మురళి, బుగ్గయ్య చౌదరి, చంద్రదండు వ్యవస్థాపకుడు ప్రకాశ్‌ నాయుడు తదితరులకు నోటీసులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.

ఈ పరిణామంతో పార్టీ హైకమాండ్ వద్ద జేసీ కుటుంబ పరపతిపై చర్చ జరుగుతోంది. జిల్లాలోని చాలా మంది టీడీపీ నేతలతో జేసీ కుటుంబసభ్యులకు పొసగడం లేదు. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాస్, పల్లె రఘురాథరెడ్డి లాంటి వారితోనూ పదేపదే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదానికి దిగుతున్న ఉదంతాలు ఉన్నాయి.

First Published:  30 Oct 2022 2:51 AM GMT
Next Story