Telugu Global
Andhra Pradesh

కాల్వకు జేసీ గండం తప్పదా?

రాయదుర్గంలో టికెట్‌ను ఒకప్పుడు కాల్వ కోసం దీపక్ రెడ్డి త్యాగం చేశారు. అప్పట్లో త్యాగం చేసిన సీటును 2024 ఎన్నికల్లో తనకే కావాలని ఎమ్మెల్సీ దీపక్ గట్టిగా పట్టుబడుతున్నారట. ఇంతకీ దీపక్ ఎవరంటే జేసీ బ్రదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకరరెడ్డికి అల్లుడే.

కాల్వకు జేసీ గండం తప్పదా?
X

వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు టికెట్ అనుమానంగా తయారైంది. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడుకు ఈ మాజీ మంత్రి చాలా సన్నిహితుడనే చెప్పాలి. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేసిన మొదటిసారే అనంతపురం ఎంపీగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రయిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు దగ్గర ప్రాధాన్యతయితే తగ్గలేదు.

ఇంత సన్నిహితంగా ఉంటున్న కాల్వకు టికెట్ గ్యారెంటీ ఏమిటనే సందేహం రావచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే రాయదుర్గంలో టికెట్‌ను ఒకప్పుడు కాల్వ కోసం దీపక్ రెడ్డి త్యాగం చేశారు. అప్పట్లో త్యాగం చేసిన సీటును 2024 ఎన్నికల్లో తనకే కావాలని ఎమ్మెల్సీ దీపక్ గట్టిగా పట్టుబడుతున్నారట. ఇంతకీ దీపక్ ఎవరంటే జేసీ బ్రదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకరరెడ్డికి అల్లుడే. ఆర్ధికంగానే కాకుండా రాజకీయంగా కూడా చాలా బలమైన స్ధితిలో ఉన్నారు దీపక్.

రాయదుర్గంలో టికెట్ కోసం దీపక్ ఒకరే ప్రయత్నిస్తే పరిస్ధితి ఎలాగుండేదో కానీ ఈ ఎమ్మెల్సీకి మద్దతుగా జేసీ బ్రదర్స్ బాగా పట్టుబడుతున్నారట. దీపక్‌కు టికెట్ ఇవ్వటం ఫ్యామిలీ ప్యాకేజీ కిందకు రాదని కూడా జేసీ బ్రదర్స్ వాదిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు తనకు అత్యంత సన్నిహితుడైన కాల్వ.. మరోవైపు జేసీల అండతో దీపక్ రెడ్డి టికెట్ కోసం బాగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో కాల్వపై ఆర్ధికపరమైన ఆరోపణలు కూడా ఉన్నాయట. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్ధులకు పంపిణీ చేయాల్సిన నిధులను సరిగా పంపకుండా కాల్వ తన జేబులో వేసుకున్నట్లు ఓడిపోయిన అభ్యర్ధులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట. కాల్వలాగే దీపక్ కూడా చంద్రబాబు, లోకేష్‌కు సన్నిహితుడే కావటంతో ఏం చేయాలో తోచటం లేదు. అందుకనే సమస్యలో నుండి బయటపడేందుకు దీపక్‌ను నెల్లూరు జిల్లాలో ఏదో ఒక‌ నియోజకవర్గంలో అకామిడేట్ చేస్తానని చంద్రబాబు ప్రతిపాదించారట. అయితే అందుకు దీపక్ అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూస్తుంటే కాల్వకు జేసీ గండం తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  19 Nov 2022 6:16 AM GMT
Next Story