Telugu Global
Andhra Pradesh

ముసుగు తొలగించిన జేపీ.. బాబుకి ఫలితం ఉంటుందా..?

తాను కూటమికి మద్దతు తెలిపితే తనపై కులముద్ర వేస్తారని తెలుసంటూనే జేపీ ముసుగు తీసేశారు. ఇక రామోజీ స్క్రిప్ట్ లో భాగంగా చంద్రబాబు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ వెంటనే ఓ ట్వీట్ వేశారు.

ముసుగు తొలగించిన జేపీ.. బాబుకి ఫలితం ఉంటుందా..?
X

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా చెప్పుకునే జయప్రకాష్ నారాయణ.. తాను ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. సరిగ్గా ఎన్నికల వేళ జేపీ ముసుగు తొలగించడం, బాబుకి మద్దతివ్వడం, ఆ తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఇలాంటి మేథావులందరూ బయటకు రావాలని బాబు పిలుపివ్వడం.. రామోజీ స్క్రిప్ట్ కాక మరొకటి కాదు అంటున్నారు నెటిజన్లు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న జేపీ సరిగ్గా ఎన్నికల వేళ కుల రాజకీయాలంటూ విమర్శలు చేయడం విశేషం.


కులముద్ర..

తాను కూటమికి మద్దతు తెలిపితే తనపై కులముద్ర వేస్తారని తెలుసంటూనే జేపీ ముసుగు తీసేశారు. జయప్రకాష్ నారాయణని మేథావిగా పేర్కొంటూ, ఆయనకు ఎక్కడలేని ప్రాముఖ్యత ఇచ్చి, ఆయన పార్టీకి ప్రచారం చేసి, పరోక్షంగా చంద్రబాబుకి మేలు చేసింది రామోజీరావే. లోక్ సత్తా అంటూ నేరుగా ప్రజా క్షేత్రంలో దిగిన జేపీ, తన సత్తా ఏంటో తెలిశాక పత్తా లేకుండా పోయారు. ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, దానికి ఆయన అధ్యక్షుడు కూడా కారు. కానీ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడిగా చెలామణి అవుతున్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం నాశనం అయిపోతోందంటూ గగ్గోలు పెడుతున్న సదరు మేథావి ఇన్నాళ్లూ ప్రభుత్వానికి ఎందుకు ఉచిత సలహాలివ్వలేదో తేలాల్సి ఉంది.

అర్బన్ ఓటర్లంతా చంద్రబాబుకి మద్దతు తెలుపుతున్నారంటూ ఇప్పటికే ఓ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది ఎల్లో మీడియా. ఇప్పుడిక మేధావుల పేరుతో మరో డ్రామాకు తెరతీసింది. జయప్రకాష్ నారాయణ, కూటమికి మద్దతు తెలిపినంత మాత్రాన విద్యావంతులు, మేధావులంతా చంద్రబాబుతో ఉన్నట్టు కాదు. ఆ మాటకొస్తే జేపీ మద్దతు వల్ల టీడీపీకి ఒరిగేదేమీ ఉండదు. కానీ ఈ ఎపిసోడ్ ని హైలైట్ చేస్తూ ఎల్లో మీడియా హడావిడి మొదలు పెట్టింది. ఇక చంద్రబాబు కూడా రెచ్చిపోతున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని, దాన్ని పరిరక్షించేందుకు భావసారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

First Published:  21 March 2024 12:57 AM GMT
Next Story