Telugu Global
Andhra Pradesh

రాజమండ్రిలో జనసేన వర్సెస్ వైసీపీ కాపుసేన..

తాజాగా వైసీపీ కాపు నేతల సమావేశం షెడ్యూల్ ఫిక్స్ కావడంతో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమను రెచ్చగొట్టేందుకే రాజమండ్రిలో కాపు నేతలతో సమావేశం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

రాజమండ్రిలో జనసేన వర్సెస్ వైసీపీ కాపుసేన..
X

ఈనెల 30న రాజమండ్రిలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకుంది. ఒకరోజు గ్యాప్ లో ఈనెల 31న అదే రాజమండ్రిలో వైసీపీ కాపు నాయకులు సమావేశం కాబోతున్నారు. ఒక్కరోజు తేడాతో జరగబోతున్న ఈ రెండు మీటింగ్ లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే విశాఖ గర్జన సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమండ్రిలో కూడా అదే స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వైసీపీ కాపు నేతల సమావేశం షెడ్యూల్ ఫిక్స్ కావడంతో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమను రెచ్చగొట్టేందుకే రాజమండ్రిలో కాపు నేతలతో సమావేశం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

వైసీపీ సమావేశం ఎందుకు..?

ఇటీవల బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో వైసీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. తాజాగా కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర నాయకులతో రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ కీలక నేతలు కూడా హాజరవుతారని సమాచారం. ఇటీవల పవన్ కల్యాణ్ తన కాలి చెప్పు చూపిస్తూ వైసీపీ నేతల్ని హెచ్చరించారు. అదే సమయంలో వైసీపీలోని కాపు నేతలపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. పవన్ కల్యాణ్ ని ఎలా డీల్ చేయాలనే విషయంపై వైసీపీ నేతలు చర్చింబోతున్నారు. పవన్ వెంట కాపులెవరూ లేరని, ఆ సామాజిక వర్గమంతా వైసీపీతోనే ఉందనే విషయం స్పష్టం చేయాలనుకుంటోంది జగన్ టీమ్.

ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కాపు నేతలు ఎక్కువగా ఉన్నందున రాజమండ్రిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నారు వైసీపీ నేతలు. కానీ రాజమండ్రిలో జనసేన పీఏసీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత వైసీపీ తమ కార్యక్రమం వివరాలు ప్రకటించడం మాత్రం విశేషం. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా పవన్ ప్రయత్నిస్తున్నారని, కానీ కాపు నాయకులంతా జగన్ ని వీడిపోరనేది వైసీపీ వాదన. అందుకే ఈ కాపు భేటీ పెట్టబోతున్నారు. ఈ సమావేశంలో పవన్ పై విమర్శలు దాడి జరిగే అవకాశముంది. కులాల వారీగా ఓట్లు చీలకుండా వైసీపీ ముందుగానే ఇలా సామాజిక వర్గాల వారీగా సమావేశాలు మొదలు పెడుతోంది.

First Published:  29 Oct 2022 7:42 AM GMT
Next Story