Telugu Global
Andhra Pradesh

జనసేన డ్యామేజ్‌ కంట్రోల్‌కు దిగిందా?

జ‌న‌సేన నేత‌ బొలిశెట్టి సత్యనారాయణ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఏముందంటే.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ముద్రగడ ఎలాంటి లేఖ రాసినా దానిపై దయచేసి స్పందించవద్దని కోరారు. ముద్రగడ లేఖలపై స్పందించటం వల్ల ఇష్ట్యూ పూర్తిగా డైవర్ట్ అయిపోతోందన్నారు.

జనసేన డ్యామేజ్‌ కంట్రోల్‌కు దిగిందా?
X

జనసేన డ్యామేజ్‌ కంట్రోల్‌కు దిగిందా?

నాలుగు రోజుల తర్వాత జనసేనకు జరిగిన డ్యామేజ్‌ ఏమిటో అర్థ‌మైనట్లుంది. అందుకనే పార్టీలో కీలక నేత, పవన్ సన్నిహితుడు బొలిశెట్టి సత్యనారాయణ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఏముందంటే ముద్రగడ పద్మనాభంపై ఎవరు కూడా ఏ విధంగానూ స్పందించవద్దని. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ముద్రగడ ఎలాంటి లేఖ రాసినా దానిపై దయచేసి స్పందించవద్దని బొలిశెట్టి కోరారు. పవన్‌కు వ్యతిరేకంగా ముద్రగడ లేఖలపై స్పందించటం వల్ల ఇష్ట్యూ పూర్తిగా డైవర్ట్ అయిపోతోందన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ వారాహి యాత్ర చేస్తుంటే ఉద్యమనేత లేఖల కారణంగా విషయమంతా ముద్రగడ రాసిన లేఖల చుట్టే తిరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇదంతా చేయిస్తున్నట్లు బొలిశెట్టి ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ముద్రగడను అనవసరంగా కెలికిందే పవన్. తనపైన పవన్ ఆరోపణలు చేస్తేనే ముద్రగడ లేఖ రాశారు. లేకపోతే అసలు పవన్ను ముద్రగడ ఎందుకు పట్టించుకుంటారు? పవన్‌పైన కాపుల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను బొలిశెట్టి గ్రహించినట్లున్నారు. అందుకనే వీడియో రూపంలో అప్పీల్ చేశారు.

అనవసరమైన విషయాలు మాట్లాడద్దని బొలిశెట్టి తమ పార్టీ అధినేతకు చెబితే బాగుంటుంది. ఇక పిఠాపురంలో తనపైన పోటీ చేయాలని పవన్‌ను ముద్రగడ సవాలు చేయటాన్ని బొలిశెట్టి చాలా తేలికగా తీసిపారేశారు. ఎలాగంటే పవన్-ముద్రగడ సమాన స్థాయి నేతలు కారట. పవన్‌కు సమాన స్థాయి నేతంటే జగన్ మాత్రమేనట. అందుకనే వచ్చే ఎన్నికల్లో జగన్-పవన్ కోస్తా జిల్లాల్లోని ఏదైనా నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందన్నారు. జగన్ గనుక రాయలసీమ కాకుండా ఇకెక్కడైనా పోటీ చేయటానికి రెడీ అయితే పవన్ కూడా అక్కడి నుండే పోటీ చేస్తారని చెప్పారు.

వియ్యానికైనా కయ్యానికైనా సమ స్థాయి ఉండాలన్న నానుడిని బొలిశెట్టి ప్రస్తావించారు. బొలిశెట్టి చెప్పేదేమంటే జగన్-పవన్ సమాన స్థాయి నేతలని. రెండుసార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగన్‌కు పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ సమాన స్థాయి ఎలా అవుతారు? ముద్రగడ నాలుగు సార్లు పోటీచేసి మూడుసార్లు గెలిచారు. ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా పవన్ కన్నా ముద్రగడ స్థాయే ఎక్కువని అర్థ‌మవుతోంది. ముద్రగడ స్థాయినే అందుకోలేని పవన్‌కు జగన్ సమాన స్థాయని బొలిశెట్టి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

First Published:  26 Jun 2023 6:18 AM GMT
Next Story