Telugu Global
Andhra Pradesh

వివాదంలో జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్

తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి. దుబాయ్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడి ఇండియాకు పారిపోయి వచ్చాడని ఆరోపణలు వస్తున్నాయి.

వివాదంలో జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్
X

జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ కూటమి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఉదయ్‌ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్ పత్రాల్లో ఉదయ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయ్‌ శ్రీనివాస్ చదువు విషయంలో తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఉదయ్‌ శ్రీనివాస్‌పై దుబాయి పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు ఇచ్చారని.. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు.

తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి. దుబాయ్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడి ఇండియాకు పారిపోయి వచ్చాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్‌ వరకు చదివి.. ఇంజినీరింగ్ చదివానని ఉదయ్‌ చెప్పుకుంటున్నారని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.


ఈ ఆరోపణలు వైసీపీకి అస్త్రంగా మారాయి. తంగెళ్ల ఉదయ్‌ లాంటి ఆర్థిక నేరగాడిని ఎంపీగా నిలిపినందుకు జనసేనపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. దుబాయిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసి మోసాలకు పాల్పడ్డారని.. అలాంటి వ్యక్తిని ఎంపీగా చేస్తే ప్రజలకు ఏం సేవ చేస్తాడని ప్రశ్నిస్తున్నారు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి చలమలశెట్టి సునీల్. పోలింగ్‌కు మరో 9 రోజులు మాత్రమే గడువు ఉన్న వేళ ఉదయ్‌ శ్రీనివాస్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో జనసైనికులు ఆందోళనకు గుర‌వుతున్నారు.

First Published:  4 May 2024 7:17 AM GMT
Next Story