Telugu Global
Andhra Pradesh

జనసేన సభ విషయంలో హై టెన్షన్.. ర్యాలీలపై పోలీస్ ఆంక్షలు

మచిలీపట్నం సభకు వారాహిలో పవన్ వస్తారని, భారీ ర్యాలీ జరుగుతుందని జనసైనికులంటున్నారు. ఇప్పుడు పోలీసుల ప్రకటనలు ర్యాలీలకు అడ్డంకిగా మారాయి.

జనసేన సభ విషయంలో హై టెన్షన్.. ర్యాలీలపై పోలీస్ ఆంక్షలు
X

మంగళవారం మచిలీపట్నంలో జరగబోతున్న జనసేన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ 10వ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించడానికి జనసేన శ్రేణులు సమాయత్తమయ్యాయి. అయితే సరిగ్గా కొన్ని గంటల ముందు కృష్ణాజిల్లా ఎస్పీ వ్యాఖ్యలు జనసైనికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కృష్ణా జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందని అన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా. ర్యాలీలు, సభలపై పోలీసు ఆంక్షలు ఉన్నాయని చెప్పారపాయన. జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ర్యాలీ లేకుండా సభ ఎలా..?

జనసేన సభకు అనుమతి ఉంది, అయితే జిల్లాలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులంటున్నారు. మరో వైపు వారాహి వాహనంలో మంగళగిరి నుంచి కదలి రావాలని చూస్తున్నారు పవన్ కల్యాణ్. మచిలీపట్నం సభకు వారాహిలో పవన్ వస్తారని, భారీ ర్యాలీ జరుగుతుందని జనసైనికులంటున్నారు. ఇప్పుడు పోలీసుల ప్రకటనలు ర్యాలీలకు అడ్డంకిగా మారాయి.

మనల్ని ఎవర్రా ఆపేది అని జనసైనికులంటున్నారు, పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండిటి మధ్య రేపు మచిలీపట్నంలో జరిగే సభ విషయంలో టెన్షన్ నెలకొంది. గతంలో కూడా పవన్ కల్యాణ్ ర్యాలీలకు అనుమతివ్వకుండా పోలీసులు అడ్డుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తితే, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

First Published:  13 March 2023 3:16 PM GMT
Next Story