Telugu Global
Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో జనసేన బలమైన పార్టీ అంటా.! ఎలాగో తెలుసా?

ఈ పార్టీలన్నింటిలో జనసేన పార్టీనే సంపన్నమైనదిగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రూ. 26.37 కోట్లు విరాళంగా వచ్చాయి. గత ఏడాది వరకు రూ. 22.37 కోట్ల విరాళాలు ఉండగా.. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ. 4 కోట్ల మేర విరాళాలు సేకరించడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో జనసేన బలమైన పార్టీ అంటా.! ఎలాగో తెలుసా?
X

'ఏపీ, తెలంగాణలో బలమైన పార్టీ జనసేన'... తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం వార్డు మెంబర్ కూడా లేడు. ఏపీలో ఏకంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి ఓడిపోయారు. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే వైసీపీ పంచన చేరాడు. ఇక ఈ పార్టీ ఎలా బలమైనది అని మీకు డౌటు రావచ్చు. అయితే జనసేనది ప్రజా బలం కాదు. ఆర్థిక బలం. ఇక్కడ ఇంకో అనుమానం కూడా తలెత్తుతుంది. టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ కంటే జనసేనకు ఆర్థిక బలం ఎక్కువా అని.? అసలు విషయం ఏంటంటే.. గుర్తింపు లేని పార్టీల్లో ఆర్థికంగా బలమైన పార్టీ జనసేన అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. జనబలం లేకపోయినా.. ఆ పార్టీకి మాత్రం ఆర్థిక బలం మాత్రం బాగానే ఉందని తెలుస్తుంది.

తెలంగాణలో మొత్తం 119 రాజకీయ పార్టీలకు గుర్తింపు లేదు. వీటిలో 12 పార్టీలు తమ వార్షిక నివేదిక‌లు సమర్పించగా.. వాటి వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో జనసేన, తెలంగాణ జన సమితి వంటి పార్టీలు అన్‌రికగ్నైజ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. వీటిలో జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించామని, తెలంగాణ జన సమితికి మాత్రం ఎలాంటి గుర్తు ఇవ్వలేద‌ని తెలిపింది. అయితే ఫ్రీ సింబల్స్ నుంచి ఏదో ఒకటి తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 77 అన్‌రికగ్నైజ్డ్ పార్టీలు పోటీ చేశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 35 గుర్తింపులేని పార్టీలు పోటీ చేశాయి. వీటిలో జనసేన, తెలంగాణ జనసమితి, తెలంగాణ యువశక్తి, సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్, ఇంటి పార్టీ, యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, యువశక్తి, యువ పార్టీ, మైనార్టీ ఓబీసీ రాజ్యం, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన, సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్రీయ జనతాదళ్, లోక్‌సత్తా, మన పార్టీ, అన్నా వైఎస్సార్ పార్టీ వంటివి ఉన్నాయి.

ఈ పార్టీలన్నింటిలో జనసేన పార్టీనే సంపన్నమైనదిగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రూ. 26.37 కోట్లు విరాళంగా వచ్చాయి. గత ఏడాది వరకు రూ. 22.37 కోట్ల విరాళాలు ఉండగా.. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ. 4 కోట్ల మేర విరాళాలు సేకరించడం గమనార్హం. ఇప్పటి వరకు పార్టీ నిర్వహణకు రూ. 20.28 కోట్లు ఖర్చు చేసినట్లు జనసేన పేర్కొన్నది. 2020 వరకు రూ. 14.35 కోట్లు ఖర్చు చేయగా.. ఆ తర్వాత పార్టీ భవనాలకు రూ. 1.01 కోట్లు, వాహనాలకు రూ. 66.37 లక్షలు, ఆఫీస్ సామగ్రి రూ. 56.34 లక్షలు, ఇన్స్యూరెన్స్ కోసం రూ. 95.47 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నది. 2020లో జనసేన ఖాతాలో రూ. 7.60 కోట్లు నిల్వ ఉన్నాయని చెప్పింది. అయితే గత ఏడాది ఈ నిల్వ రూ. 3.87 కోట్లకు తగ్గిపోయినట్లు పేర్కొన్నది.

ఇక ఆదాయ వార్షిక నివేదిక ఇచ్చిన మరో పార్టీ లోక్‌సత్తా వద్ద రూ. 26.13 లక్షలు ఉన్నట్లు వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.39 లక్షల ఆదాయం రాగా.. ఫ్లడ్ రిలీఫ్ కోసం పంపిణీ చేసినట్లు పేర్కొన్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 119 పార్టీలకుగాను 12 పార్టీలు ఆదాయ, వ్యయ వివరాలు అందించాయి. వాటిలో సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఆదాయం, వ్యయం లేదని పేర్కొన్నది. కాగా ఈ పార్టీ గత ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడం గమనార్హం.

First Published:  31 Aug 2022 1:40 AM GMT
Next Story