Telugu Global
Andhra Pradesh

పవన్ అజెండా ఇదేనా..?

ఇక తనకు రామకృష్ణా బీచ్ లో నడవాలని ఉందని దీనికి కూడా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలేమో అని ఒకటి, హోటల్ గదిలోని కిటికీలో నుండి కూడా బయటకు చూడకూడదని పోలీసులు చెబుతారేమో అని మరో ట్వీటు పెట్టారు.

పవన్ అజెండా ఇదేనా..?
X

విశాఖపట్నంలోని ఓ హోటల్లో కూర్చుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరసబెట్టి ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ల కారణంగా హోటల్ చుట్టుపక్కల జనాలు విపరీతంగా చేరుతున్నారు. జనాలంటే నగరంలోని ప్రజలని కాదు అర్థం. కేవలం పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రమే. ట్వీట్లు చేయటంలో పవన్ రహస్య అజెండా ఉందేమో అని అనుమానంగా ఉంది. ఇంతకీ ఆ అజెండా ఏమిటంటే ఒకటి తనను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని జనాలందరికీ తెలియజేయటం.

రెండో కారణం ఏమిటంటే తనను పోలీసులు హౌస్ అరెస్టులా హోటల్ అరెస్టుచేసిందని పరోక్షంగా అందరికీ తెలియజేయటం. ఇక మూడోది ఏమిటంటే మొదటిరెండు విషయాలు తెలియజేయటం ద్వారా పబ్లిక్ సింపతీని పొందటం. పవన్ ట్వీట్లు చూసిన వాళ్ళెవరికైనా ఇదే అనుమానాలు వస్తాయి. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా ర్యాలీలు, సభలు, పబ్లిక్ గ్యాదరింగుల్లో పాల్గొనకూడదని పోలీసులు ఆంక్షలు విధించారని చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో ఏవి చేయకూడదో పోలీసులు చెప్పారు కానీ హోటల్లో పార్టీ నేతలతో సమావేశం అవ్వకూడదని చెప్పలేదు. తమ నేతలతో సమావేశం అవుతున్నది లేనిది పవన్ కూడా చెప్పలేదు. ఒకరకంగా తనను హోటల్లోనే పోలీసులు నిర్భందించారనే అర్థం వచ్చేట్లుగా ట్వీట్లు పెట్టారు.


ఇక తనకు రామకృష్ణా బీచ్ లో నడవాలని ఉందని దీనికి కూడా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలేమో అని ఒకటి, హోటల్ గదిలోని కిటికీలో నుండి కూడా బయటకు చూడకూడదని పోలీసులు చెబుతారేమో అని మరో ట్వీటు పెట్టారు. ప్రజల సంపతీ కోసం ఇన్ని ట్వీట్లు పెడుతూనే మరోవైపు తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ ట్వీట్ల వల్లే జనసైనికులు, అభిమానులు హోటల్ చుట్టుపక్కల పెద్దఎత్తున చేరుకుంటున్నారు. హోటల్ గదిలో కూర్చునే ఇన్ని చేస్తున్న పవన్ మంత్రులపై దాడులు చేసింది జనసేన కార్యకర్తలే అన్న మీడియా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

First Published:  16 Oct 2022 2:41 PM GMT
Next Story