Telugu Global
Andhra Pradesh

పవన్ భయపడుతున్నది నిజమేనా?

ద్వారంపూడి ఆరోపణల్లో నిజమెంతో ఎవరికీ తెలియ‌దు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై పవన్ కానీ పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు.

పవన్ భయపడుతున్నది నిజమేనా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలకు భయపడుతున్నారా? బీజేపీ పెద్దలకు పవన్ భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ భయంతోనే బీజేపీ పొత్తు నుండి బయటపడలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. ఇంతకీ ఎమ్మెల్యే ఏమన్నారంటే చంద్రబాబు దగ్గర పవన్ రూ.1400 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారట. ఆ మొత్తాన్ని రష్యా, దుబాయ్, సింగపూర్‌కు తరలించినట్లు ఆరోపించారు.

పవన్ ప్యాకేజీ తీసుకోవటం, విదేశాలకు తరలించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరున్నాయట. ఈ కారణంగానే బీజేపీని వదిలేయాలంటే పవన్ భయపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. బీజేపీ పొత్తు నుండి బయటకు వచ్చేస్తే ఏమి జరుగుతుందో పవన్‌కు బాగా తెలుసు అంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా దమ్ముంటే బీజేపీతో పవన్‌ను తెగతెంపులు చేసుకోవాలని చాలెంజ్ విసురుతున్నారు. ద్వారంపూడి ఆరోపణల్లో నిజమెంతో ఎవరికీ తెలియ‌దు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై పవన్ కానీ పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు.

మామూలుగా పవన్‌పై ఆరోపణలు రాగానే పార్టీ నేతలు వరసబెట్టి మీడియా ముందుకొచ్చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించకపోవటంతో పవన్‌పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు పెడనలో స్వయంగా పవన్ ప్రకటించారు. అలాంటిది 24 గంటలు తిరగకముందే ముదినేపల్లిలో మాట్లాడుతూ.. తాను ఎన్డీయేలోనే ఉన్నట్లు మాట మార్చేశారు. బీజేపీ పెద్దలంటే పవన్ భయపడుతున్నారని ద్వారంపూడి చెప్పింది నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

పనిలోపనిగా పవన్ భార్యది రష్యా. పిల్లలను చదివిస్తున్నది సింగపూర్లో అంటున్నారు. అలాగే దుబాయ్‌తో చంద్రబాబుకు సుదీర్ఘ అనుబంధముందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఈ మూడు దేశాలనే ప్రస్తావించటంతో ప్యాకేజీ, డబ్బుల తరలింపు, బీజేపీ అంటే భయపడటం, తనపై ఆరోపణలకు పవన్ లేదా నేతలు స్పందించకపోవటం అంతా చూస్తుంటే ఎమ్మెల్యే ఆరోపణలు నిజమేనా అనిపిస్తోంది. బహుశా ఇందుకనే బీజేపీతో ఉండలేక అలాగని వదిలేయలేక పవన్ నానా అవస్థ‌లు పడుతుంది.


First Published:  9 Oct 2023 4:57 AM GMT
Next Story