Telugu Global
Andhra Pradesh

50కి తగ్గేది లేదంటున్న పవన్.. అన్ని ఇచ్చేది లేదంటున్న చంద్రబాబు.!

జనసేనకు కేవలం 15 సీట్లు మాత్రమే కేటాయించి.. గెలిస్తే ఎమ్మెల్సీ స్థానాల రూపంలో జనసేనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

50కి తగ్గేది లేదంటున్న పవన్.. అన్ని ఇచ్చేది లేదంటున్న చంద్రబాబు.!
X

మచిలీపట్నం వేదికగా జరిగిన సభలో పవన్ కల్యాన్ అనేక అనుమానాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సారి బలి పశువు కాబోనంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా మెసేజ్ పంపారు. గతంలో టీడీపీ ఆడించినట్లు జనసేన, పవన్ కల్యాణ్ ఆడారు. కానీ ఈ సారి మాత్రం తాము కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందేననే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తున్నది. తాను 20 సీట్లకు మాత్రమే అంగీకరించానని జరుగుతున్న ప్రచారంపై కూడా పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. తాను అలా అంగీకరించలేదని.. తనను నమ్మాలంటూ చేతులెత్తి మరీ పవన్ దండాలు పెట్టారు. అయితే ఇంతకు ఎన్ని సీట్లకు పవన్ ఒత్తిడి తెచ్చారు? చంద్రబాబు అందుకు అంగీకరించారా అనే విషయంపై ఇప్పుడు ఓ చర్చ జరుగుతున్నది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండటం దాదాపు ఖరారయినట్లే. ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు పవన్ సభ ద్వారా స్పష్టం అయ్యింది. అయితే, జనసేనకు కేవలం 15 సీట్లు మాత్రమే కేటాయించి.. గెలిస్తే ఎమ్మెల్సీ స్థానాల రూపంలో జనసేనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు పార్టీల్లో ఇదే ప్రచారం జరుగుతున్నది. కానీ, జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం ఈ ప్లాన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం. తమకు కనీసం 50 సీట్లను కేటాయించాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తున్నారని వినికిడి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ గెలిచిన మెజార్టీ కంటే జనసేనకు పోలైన ఓట్లే ఎక్కువ. ఆ ఎన్నికల్లో జనసేన 9 శాతం ఓట్ షేర్ గెలుచుకున్నది. ఇప్పుడు అయితే ఆ ఓట్ల శాతం 12 శాతానికి పెరిగిందని జనసేన భావిస్తోంది. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసినా కనీసం 20 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే పొత్తులో తమకు కనీసం 50 సీట్లు కేటాయించాలని కోరుతోంది. కానీ, చంద్రబాబు మాత్రం దీనికి సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది.

ఉమ్మడి గోదావరి జిల్లాలు, కోస్తాంధ్రంలో కొన్ని చోట్ల తప్ప జనసేనకు అసలు బలం లేదని టీడీపీ అంటోంది. జనసేనకు పెద్దగా బలం లేకపోవడమే కాకుండా.. కనీసం క్షేత్ర స్థాయి క్యాడర్ కూడా లేదని.. అలాంటి పార్టీకి 50 సీట్లు కేటాయిస్తే.. అది వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అన్ని సీట్లు ఇవ్వలేమని.. 10 నుంచి 15 సీట్లతో సర్దుకోవాలని జనసేనకు సూచిస్తున్నారు. ఈ విషయాన్నే పవన్ కల్యాణ్, జనసేన వర్గాలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

జనసేనకు భారీగా సీట్లు కేటాయిస్తే అది మొదటికే మోసం వస్తుందని.. కచ్చితంగా అది వైఎస్ జగన్, వైసీపీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే, ఈ మ్యాటర్ జనసేన వర్గాలకు చెప్పినా కన్విన్స్ కావడం లేదని సమాచారం. తాము పట్టుబట్టిన సీట్లు ఇవ్వాల్సిందే అని జనసేన అగ్రనాయకత్వం కోరుతోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా ఈ విషయంపై ఏమీ తేల్చలేదని సమాచారం. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో సీట్ల పంపిణీ విషయం తర్వాత ఆలోచిద్దామని చెప్పినట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి జనసేన మాత్రం 50 సీట్లకు మాత్రం తగ్గేది లేదని అంతర్గతంగా చర్చించినట్లు సమాచారం. దీనికి టీడీపీ మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది. మరి చివరకు ఎవరు రాజీ పడతారో వేచి చూడాల్సిందే.

First Published:  18 March 2023 4:58 AM GMT
Next Story